హైదరాబాదీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ తాజాగా తన బయోగ్రఫీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. "281 అండ్ బియాండ్" అనే ఆ పుస్తకాన్ని స్పోర్ట్స్ రైటర్ ఆర్.కౌశిక్ రచించారు. ఈ బయోగ్రఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో వీవీఎస్ లక్ష్మణ్ మీడియాతో ముచ్చటించారు. వారు అడిగిన పలు ప్రశ్నలకూ జవాబులిచ్చారు. ఈ మీడియా సమావేశం సందర్భంగా లక్ష్మణ్ బయోపిక్ అంశం కూడా ప్రస్తావనకు రాగా.. ఆ అంశంపై కూడా లక్ష్మణ్ సమాధానమిచ్చారు. గతంలో కూడా కొందరు సినీ దర్శకులు ఈ బయోపిక్ విషయమై తనను సంప్రదించారని ఆయన అన్నారు.
అయితే అప్పుడు తాను పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు బయోగ్రఫీ విడుదల అయ్యింది కాబట్టి.. బయోపిక్ మీద కూడా ఆసక్తి కలుగుతోందని లక్ష్మణ్ అన్నారు. మహేష్ బాబు లాంటి నటులు తన బయోపిక్‌లో నటిస్తే బాగుంటుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. తాను మహేష్ బాబు నటించిన అనేక సినిమాలు చూశానని.. అతను చాలా మంచి యాక్టర్ అని లక్ష్మణ్ కితాబిచ్చాడు. అలాంటి వ్యక్తి తన బయోపిక్‌లో తన పాత్ర పోషిస్తే బాగుంటుందని తాను అనుకుంటున్నానని లక్ష్మణ్ అన్నారు.
తన కెరీర్లో 127 టెస్టు మ్యాచ్‌లకు మరియు 86 వన్డే మ్యాచ్‌లకు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించిన లక్ష్మణ్.. 20 ఐపీఎల్ మ్యాచ్‌ల్లోనూ ఆడాడు. అతని టెస్టు కెరీర్లో 2 డబుల్ సెంచరీలతో పాటు 17 సెంచరీలు, 56 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి. అలాగే వన్డే కెరీర్లో 6 సెంచరీలు, 10 అర్థ సెంచరీలు కూడా చేశారు లక్ష్మణ్. 2008లో జరిగిన మొట్టమొధటి ఐపిఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ జట్టుకు లక్ష్మణ్ నాయకత్వం వహించాదు.2011లో లక్ష్మణ్‌కు భారత ప్రభుత్వం పద్మ శ్రీ పురస్కారం అందించింది.