ప్రపంచంలో తమ తమ రంగాల్లో ఎన్నో ఘనతలు సాధించి.. లెజెండరీ పీపుల్‌గా ఖ్యాతి గాంచిన ఎందరో మహనీయులు ఉన్నారు. అయితే అలాంటి వారిలో కూడా కొన్ని వింత అలవాట్లు ఉన్నాయి. చాలా చిత్రంగా ఉండే ఈ అలవాట్లు వారి కెరీర్‌కు ఎలాంటి భంగమూ కలిగించలేదు. అయితే ఈ అలవాట్లను గురించి విన్నవారికి తప్పకుండా ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి కొందరు ప్రముఖ వ్యక్తుల చిత్రమైన అలవాట్లేమిటో మనం కూడా తెలుసుకుందాం.
వోల్టేర్: ప్రముఖ తత్వవేత్త వోల్టేర్ ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు రాశారు. అయితే ఆయనకున్న వింత అలవాటు ఏమిటంటే.. ఆయన ప్రతీ రోజు కనీసం 40 నుండి 50 కప్పుల వరకూ కాఫీ తాగుతుంటారట. అలా తాగితే ఆరోగ్యం పాడవుతుందని డాక్టర్లు చెప్పినా.. ఆయన ఆ అలవాటు మానలేకపోయారట. అయినా 83 సంవత్సరాలు జీవించారు ఆయన.
బెంజిమిన్ ఫ్రాంక్లిన్: ప్రముఖ శాస్త్రవేత్త బెంజిమన్ ఫ్రాంక్లిన్ ప్రతీ రోజు ఉదయం రెండు గంటలు పూర్తిగా బట్టలు విప్పేసి.. నగ్న శరీరంతో ఒంటరిగా తన గదిలోనే పచార్లు చేసేవారట. అలా చేస్తే కొత్త ఆలోచనలు వస్తాయన్నది తన అభిప్రాయమట.
హెన్రీ ఫోర్డ్: ప్రముఖ కార్ల సంస్థ ఫోర్డ్ వ్యవస్థాపకులైన హెన్రీ ఫోర్డ్.. అంత గొప్ప ధనవంతుడైనప్పటికీ.. గల్లీల్లో దొరికే చిరుతిండి తినడానికే ఎక్కువ ఇష్టపడతారట. అది అపరిశుభ్రమైన ఆహారమని.. అలా తినవద్దని సూచించినా ఆయన ఆ అలవాటును మానలేకపోయారు. ఆ రుచిని ఆయన ఆస్వాదించకుండా ఉండలేకపోయారు.
థామస్ ఆల్వా ఎడిసన్: ప్రముఖ శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్‌కి కూడా ఓ వింత అలవాటు ఉంది. ఆయన తన వద్ద పనిచేయడానికి వచ్చే ఉద్యోగులకు సాల్ట్ టెస్ట్ పెట్టేవారట. ఈ టెస్టు ఎలా ఉంటుందంటే.. అభ్యర్థి టేబుల్ ముందు ఓ రుచిలేని సూప్‌తో పాటు సాల్ట్ డబ్బా పెట్టేవారు. అలా పెట్టాక.. అభ్యర్థికి ఆ సూప్‌ని రుచి చూసి ఎలా ఉందో చెప్పమనేవారు. ఆ సూప్ టేస్ట్ చేసి బాగానే ఉందనే వారిని ఆయన ఉద్యోగంలోకి తీసుకొనేవారు కాదు. అలాగని బాగా లేదని చెప్పేవారిని కూడా తీసుకొనేవారు కాదు. సూప్ రుచి చూశాక ఉప్పు సరిపోలేదని నిర్థారించుకొని.. ఆ తర్వాత సూప్‌లో తగినంత ఉప్పు వేసి.. మళ్లీ రుచి చూసి బాగానే ఉందని చెప్పేవారినే ఆయన ఉద్యోగంలోకి తీసుకొనేవారు.
డొనాల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి కూడా ఓ చిత్రమైన అలవాటు ఉందట. ఆయన తన జేబులో ఎప్పుడూ శానిటైజర్ పెట్టుకొని తిరుగుతుంటారట. ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చాక.. ఆయన కొద్ది సేపు ఆగి మళ్లీ శానిటైజర్ లేదా హ్యాండ్ కర్చీఫ్ తీసి.. తన చేతిని క్లీన్ చేసుకుంటూ ఉంటారని అంటారు.
యోషిరో నకమత్సు: తన జీవితంలో దాదాపు 3000 ఆవిష్కరణలు చేసిన యోషిరో నకమత్సు అనే శాస్త్రవేత్త.. తనకు ఐడియాలు రావాలని భావించినప్పుడు.. స్విమ్మింగ్ పూల్‌లో దిగి విపరీతంగా ఈత కొడతారట. ఆ తర్వాత బయటకు వచ్చి మళ్లీ ఆలోచిస్తారట. తన మెదడుతో పాటు శరీరాన్ని ఉత్తేజబరచడానికి ఈ పద్ధతి అని ఆయన చెబుతుంటారు.