సాహో మూవీ రివ్యూ, రేటింగ్

సాహో మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Last Updated : Aug 31, 2019, 01:19 PM IST
సాహో మూవీ రివ్యూ, రేటింగ్

నటీనటులు: ప్రభాస్, శ్రద్దా కపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, వెన్నెల కిషోర్‌, చుంకీ పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌ త‌దిత‌రులు.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: జిబ్రాన్
సినిమాటోగ్రాఫర్ : మధి
ఆర్ట్ డైరెక్టర్ : సాబు సిరీల్
నిర్మాణం: యువి క్రియేషన్స్
నిర్మాతలు: వంశీ-ప్రమోద్
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సుజీత్
రన్ టైమ్: 171 నిమిషాలు
సెన్సార్: U/A
రిలీజ్ డేట్: ఆగస్ట్ 30, 2019

కథ:
ముంబైలో 2వేల కోట్ల రూపాయల చోరీ జరుగుతుంది. అలాంటివి వరుసగా మూడు చోరీలు జరుగుతాయి. దీంతో పోలీసులు ఎలర్ట్ అవుతారు. ఈ కేసును సీక్రెట్ ఏజెంట్ అశోక్ చక్రవర్తి (ప్రభాస్)కి అప్పగిస్తారు. అతడికి రిపోర్టింగ్‌గా పోలీస్ ఆఫీసర్లు అమృతా నాయర్ (శ్రద్ధాకపూర్), గోస్వామి (వెన్నెల కిషోర్), డేవిడ్ (మురళీ శర్మ)ను అప్పగిస్తారు. దొంగను కనుక్కునే క్రమంలో.. 2వేల కోట్ల రాబరీ కాస్తా 2 లక్షల కోట్ల వ్యవహారంగా మారుతుంది. సరిగ్గా ఇక్కడే ట్విస్టుల మీద ట్విస్ట్‌లు వస్తాయి. కేసును డీల్ చేస్తున్న అశోక్ చక్రవర్తి ఎవరు? అశోక్‌కు 'సాహో'కు ఏంటి సంబంధం? మాఫియాతో అశోక్ ఎందుకు పెట్టుకుంటాడు? అమృతను ప్రేమించిన అశోక్ ఆమెను తిరిగి కలిశాడా లేదా అనేదే మిగతా స్టోరీ.

టెక్నీషియన్స్ పనితీరు:
సాహో సినిమా విషయానికొస్తే, నటీనటుల యాక్టింగ్ కన్నా.. సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణుల పనితనం గురించే ముందుగా చెప్పుకోవాలి. సాంకేతికంగా ఈ సినిమాను మాస్టర్ పీస్‌గా చెప్పుకోవచ్చు. 'సాహో'లో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. తెలుగుతెరపై ఇలాంటి యాక్షన్ సీన్స్ ఇప్పటివరకు చూడలేదు. హాలీవుడ్ యాక్షన్ సినిమాకు 'సాహో' ఏమాత్రం తీసిపోదు. మిషన్ ఇంపాజిబుల్, జేమ్స్ బాండ్, జాన్ విక్ సినిమాల్లో ఉన్నలాంటి యాక్షన్ సీన్స్.. తెలుగులో ఊహించుకోవడం కష్టమే. అలాంటి ఊహను నిజం చేసింది సాహో. కెన్నీ బేట్స్ టీమ్ వర్క్ తెరపై కనిపించింది.

సినిమాలో మధి సినిమాటోగ్రఫీ అడుగడుగునా కనిపిస్తుంది. కథ, కథనంతో సంబంధం లేకుండా.. పాట, ఫైట్ అనే తేడా లేకుండా అతడి వర్క్ ప్రతీ ఫ్రేమ్‌లో ఎట్రాక్ట్ చేస్తుంది. ఈ విజువల్స్‌కు జిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్లో ఉంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, సాబు సిరిల్ ఆర్ట్ వర్క్, రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్స్, కాస్ట్యూమ్స్.. ఇలా అన్ని విభాగాల్లో టాప్ లెవెల్లో ఉంది సాహో.

ఈ టెక్నీషియన్స్ అందర్నీ సమన్వయం చేసిన దర్శకుడు సుజీత్‌ను కచ్చితంగా అభినందించి తీరాల్సిందే. చేసింది రెండో సినిమానే అయినప్పటికీ వీళ్లందరి నుంచి ది బెస్ట్ అవుట్‌పుట్ తీసుకోవడం మామూలు విషయం కాదు. అయితే కథ, స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం సుజీత్ తప్పులు చేశాడు. ఇక నిర్మాతల విషయానికొస్తే.. వంశీ, ప్రమోద్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. 350 కోట్ల రూపాయల్ని నీళ్లలా ఖర్చుచేశారు. ఆ క్వాలిటీ స్క్రీన్‌పై కనిపించింది.

నటీనటుల పనితీరు:
ప్రభాస్ తన యాక్టింగ్‌తో మరోసారి మెస్మరైజ్ చేశాడు. స్క్రీన్ ప్లే ఆధారిత సినిమా కావడం, డిఫరెంట్ షేడ్స్ ఉన్నప్పటికీ ఎక్కడా తడబడలేదు. దీనికితోడు యాక్షన్ సీన్స్‌లో ప్రభాస్ తన మార్క్ చూపించాడు. విదేశీ ఫైటర్స్‌తో ప్రభాస్ ఫైట్ చేస్తుంటే అంతా రియల్ అనిపిస్తుంది. ప్రభాస్ బాడీకి యాక్షన్ కొరియోగ్రఫీ అంతలా సెట్ అయింది. శ్రద్ధాకపూర్ కూడా పోలీసాఫీసర్ పాత్రకు న్యాయం చేసింది. ఇటు పోలీస్‌గా, అటు సాంగ్స్‌లో గ్లామర్ డాల్‌గా బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చింది. మిగతా నటీనటుల్లో జాకీష్రాఫ్, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముకేష్, మురళీశర్మ, వెన్నెల కిషోర్, మందిరా బేడీ, చుంకీ పాండే తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

స్క్రీన్ ప్లేలో చాలా రకాలుంటాయి. చాలా ట్విస్ట్‌లు ఇచ్చి, చివర్లో అన్నీ ఒక్కొక్కటిగా విప్పుకుంటూ రావడం ఒక పద్ధతి. ముందే మేటర్ చెప్పేసి, తర్వాత కథను చెప్పడం మరో పద్ధతి. ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ లార్గో వించ్‌ను ఇలా రెండు రకాలుగా తెలుగులో చెప్పారు. రెండో పద్ధతిలో అజ్ఞాతవాసి సినిమా వస్తే.. మొదటి ఫార్మాట్‌లో ఇప్పుడు సాహో సినిమా వచ్చింది. అంతే తేడా.

ఓ హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కింది సాహో. మూవీలో ప్రతి ఫ్రేమ్‌లో ఆ సినిమాకు వెచ్చించిన భారీ బడ్జెట్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో. మనం చూస్తున్నది తెలుగు సినిమానా లేక హాలీవుడ్ మూవీనా అనే డౌట్ వస్తుంది. ఆ రేంజ్‌లో ఉంది సాహో సినిమా. ఇక సినిమాలో ట్విస్ట్‌లకు కొదవలేదు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ కార్డ్ పడేవరకు మినిమం గ్యాప్స్‌లో ట్విస్ట్‌లు వస్తూనే ఉంటాయి. సరిగ్గా ఇక్కడే సాహో బోల్తా కొట్టింది. ట్విస్ట్‌లైతే బాగున్నాయి కానీ, ఇవి ఆడియన్స్‌కు అంత కొత్తకాదు. మరీ ముఖ్యంగా ఈ ట్విస్టులన్నీ ఊహించేలానే ఉండడంతో సాహో ఏం చేయలేకపోయాడు. యాక్షన్ సన్నివేశాలు చూస్తే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో, ట్విస్టులు వచ్చినప్పుడు కూడా అంతే ఆశ్చర్యం కలిగినట్టయితే.. సాహో మరో బాహుబలి అయ్యేది. డైరెక్టర్ సుజీత్, స్క్రీన్ ప్లే బాగానే రాసుకున్నాడు. తెరపైకి ఆ స్క్రీన్ ప్లేను బాగానే తీసుకొచ్చాడు. కానీ అందులో కొత్తదనం ఉందా లేదా అనే విషయాన్ని చెక్ చేసుకోలేకపోయాడు. చాలామంది ఈ ట్విస్టుల్ని ముందే ఊహించగలరు. మరికొంతమంది ఈ స్క్రీన్ ప్లేతో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. 

సినిమాగా సాహో ఎక్కడా బోర్ కొట్టదు. విజువల్స్ అయితే మనల్ని కళ్లు తిప్పుకోనీయవు. ఒక్క ఫ్రేమ్ మిస్ అయినా విజువల్ ఫీస్ట్ మిస్ అయినట్టే. ఆ రేంజ్‌లో ఉంది మూవీ. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతే. నటీనటుల పెర్ఫార్మెన్స్ కూడా సూపర్బ్. ప్రభాస్ వన్ మ్యాన్ షో చూపిస్తే.. శ్రద్ధాకపూర్, నీల్ నితిన్, అరుణ్ విజయ్, మురళీశర్మ, చుంకీ పాండే అద్భుతంగా నటించారు. యాక్టింగ్‌లో ఎవ్వర్నీ తీసిపారేయడానికి లేదు. చివరికి ఫైటర్స్ కూడా మనల్ని భయపెడతారు. ఆ రేంజ్‌లో ఉన్న సాహోలో ట్విస్ట్‌ల్ని మాత్రం మనం ముందే గెస్ చేస్తుంటాం. అదే బాధాకరం.

ప్లస్ పాయింట్స్:
– ప్రభాస్ లుక్, యాక్టింగ్
– యాక్షన్ ఎలిమెంట్స్
– సినిమాటోగ్రఫీ
– బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
– ఇంటర్వెల్ బ్లాక్

మైనస్ పాయింట్స్:
– రొటీన్ స్టోరీ
– స్లో స్క్రీన్ ప్లే
ఓవరాల్‌గా.. హాలీవుడ్ రేంజ్ యాక్షన్, రిచ్ విజువల్స్, ప్రభాస్ కోసం సాహో సినిమాను చూడొచ్చు.
రేటింగ్ – 2.5/5

జీ సినిమాలు సౌజన్యంతో... 

Trending News