ఈనెల 20న అరవింద సమేత ఆడియో విడుదల

త్రివిక్రమ్‌-ఎన్టీఆర్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'.

Last Updated : Sep 8, 2018, 12:10 PM IST
ఈనెల 20న అరవింద సమేత ఆడియో విడుదల

త్రివిక్రమ్‌-ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ'. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 20న 'అరవింద సమేత 'ఆడియోని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ ఈవెంట్ కోసం హైదరాబాద్‌లో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌ని కూడా బుక్ చేయనున్నట్లు సమాచారం. అలాగే ఈ ఆడియో వేడుకకు ముఖ్య అథితిగా బాలకృష్ణని ఆహ్వానించాలని కూడా అనుకుంటున్నారట!

ఇటీవలే ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్‌ని సిక్స్ ప్యాక్‌లో చూపించారు. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చిత్రబృందం పేర్కొంది.

రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగే ఈ కథలో.. ఎన్టీఆర్‌కు, సునీల్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు, సంభాషణలతో పాటు రాయలసీమ మాండలికంలో ఎన్టీఆర్‌ చెప్పే డైలాగులు చిత్రానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.

ఈ చిత్రంలో కీలక పాత్రల్లో జగపతిబాబు, నాగబాబు, ఈషా రెబ్బలు నటిస్తున్నారు. సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి అందించిన సాహిత్యానికి తమన్‌ సంగీతం అందించాడు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్‌ 11న విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేస్తోంది.

 

Trending News