బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సల్మాన్ ఖాన్ తండ్రి సలీంఖాన్ వల్లే ఈ రోజు తాను ఒక సూపర్ స్టార్ హోదాలో ఉన్నానని ఆయన తెలిపారు. సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షో ‘దస్ కా దమ్’కు ముఖ్య అతిథిగా హాజరైన షారుఖ్ కొన్ని విషయాలను పంచుకున్నారు. "నేను ముంబయి వచ్చిన తొలినాళ్లలో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం గారు నన్ను ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. కెరీర్ విషయంలో నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. వారి మేలు నేను జన్మలో మర్చిపోలేను. ఈ రోజు షారుఖ్ అనే పేరు మీకు వినిపిస్తుందంటే అందుకు ఒక కారణం సలీం గారు అని కూడా చెప్పుకోవచ్చు" అని తెలిపారు.
అలాగే తనకు, సల్మాన్ ఖాన్‌కి మధ్య ఉన్న స్నేహబంధం గురించి కూడా తెలిపారు షారుఖ్. ఈ షోకి సల్మాన్ ఖాన్ పిలవడం వల్లే తాను వచ్చానని ఆయన తెలిపారు. సల్మాన్, షారుఖ్‌ల మధ్య కొన్ని రోజుల క్రితం వివాదాలు చెలరేగిన విషయం మనకు తెలిసిందే. వారిద్దరూ బద్ధ శత్రువులైనట్లు కూడా కొన్నాళ్ల క్రితం పలు వార్తాపత్రికలు రాశాయి.
కత్రినాకైఫ్ పుట్టినరోజు వేడుకలప్పుడు సల్మాన్, షారుఖ్‌లు ఒకరి మీద ఒకరు చేయి చేసుకున్నట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత వారిద్దరు తమ మధ్య గొడవలేమీ లేవని మీడియా ముఖంగానే తెలిపారు. పైగా ఆ గొడవ జరిగిన ఒక సంవత్సరం క్రితమే సల్మాన్, షారుఖ్ నటించిన "ఓం శాంతి ఓం"లో అతిథి పాత్రలో నటించారు. అలాగే గతంలో సల్మాన్, షారుఖ్ కలిసి కరణ్ అర్జున్, కుచ్ కుచ్ హోతా హై, హమ్ తుమ్హారే హే సనమ్, దుష్మన్ దునియా కా లాంటి చిత్రాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం షారుఖ్ నటిస్తున్న "జీరో" చిత్రంలో కూడా సల్మాన్ ఓ అతిథి పాత్ర పోషిస్తున్నారు.