నటీనటులు: చేతన్ మద్దినేని, కాశిష్ వోరా, వి.కె.నరేష్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, రావురమేష్, పోసానికృష్ణమురళి, తనికెళ్ళభరణి, వెన్నెల కిషోర్, ప్రయదర్శి తదితరులు
డైలాగ్స్: అయ్యాన్ శ్రవన్
లిరిక్స్: వనమాలి
ఆర్ట్: సత్యసాయి
మ్యూజిక్: కిరణ్ రవీంద్రనాధ్
ప్రొడ్యూసర్: మంజునాధ్ వి కందుకూర్
డైరెక్టర్: నరేష్ కుమార్
సెన్సార్: U/A
నిడివి: 2 గంటల 8 నిమిషాలు
రిలీజ్ డేట్ : జూన్ 21, 2019
ఫస్ట్ ర్యాంక్ రాజు.. టైటిల్‌లోనే హీరో క్యారెక్టర్ కనిపిస్తోంది. కానీ అసలు కథ వేరే ఉంది. ఇప్పుడున్న విద్యా వ్యవస్థపై సెటైరిక్‌గా తీసిన సినిమా ఇది. కన్నడ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ ఇంతకీ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందా లేదా తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:
క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్ ఉంటాడు రాజు. ఏ క్లాస్ కెళ్లినా అక్కడ అతడే ఫస్ట్. అందుకే అతడ్ని అంతా ఫస్ట్ ర్యాంక్ రాజు అంటారు. కేవలం పుస్తకాలే అతడి లోకం. అలా ఫస్ట్ ర్యాంక్‌తో పాసై ఉద్యోగ ప్రయత్నం చేసిన రాజుకు ఎక్కడా ఉద్యోగం దొరకదు. చివరికి ఆత్మహత్యకు కూడా ప్రయత్నిస్తాడు రాజు. దీనికి కారణం అతడికి లోకజ్ఞానం లేకపోవడమే.
ఎలాగైనా రాజును సమాజంలో కలపాలని ప్రయత్నిస్తుంటారు వాళ్ల తల్లిదండ్రులు. ఈ క్రమంలో రాజు తల్లిదండ్రులు ఏం చేశారు? వాళ్లు రాజును మార్చగలిగారా? ఫస్ట్ ర్యాంక్ రాజు సొసైటీలో కూడా ఫస్ట్ ర్యాంక్‌తో నిలబడగలిగాడా అనేది ఈ సినిమా స్టోరీ.
నటీనటుల పనితీరు:
హీరో చేతన్ నటించడానికి చాలా కష్టపడ్డాడు. ఉన్నంతలో ఓకే అనిపించాడు. ఫస్ట్ ర్యాంక్ రాజుగా, రోమియోగా మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ కన్నడ వెర్షన్‌తో పోల్చి చూసుకుంటే చేతన్ యాక్టింగ్ తేలిపోతుంది. హీరోయిన్ కశిష్ ఓరా గ్లామరస్‌గా ఉంది తప్ప పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. హీరో, హీరోయిన్లు తప్ప సినిమాలో మిగతావాళ్లంతా బాగా నటించారు.
హీరో తండ్రిగా నరేష్, ఫ్రెండ్‌గా ప్రియదర్శితో పాటు ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, పోసాని, వెన్నెల కిషోర్.. ఇలా చాలామంది ఆర్టిస్టులున్నారు ఈ సినిమాలో. పేరున్న నటీనటులంతా ఉన్నప్పటికీ వాళ్లకు దొరికిన స్కోప్ మాత్రం చాలా తక్కువనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా బ్రహ్మానందం లాంటి సీనియర్ కమెడియన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు.
టెక్నీషియన్స్ పనితీరు:
ఈ సినిమాకు టెక్నీషియన్స్ నుంచి పెద్దగా సపోర్ట్ అందలేదు. ఒరిజినల్ వెర్షన్‌కు పనిచేసిన కిరణ్ రవీంద్రనాధ్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ ఇచ్చాడు. ఇతడిచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఒక్క పాట మాత్రం ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేది.
దర్శకుడు నరేష్ కుమార్ ఈ రీమేక్‌కు పెద్దగా మార్పులు చేయడానికి ఇష్టపడలేదు. అది కొన్ని చోట్ల ప్లస్ అయింది, మరికొన్ని చోట్ల మైనస్ అయింది. ప్రకాష్ రాజ్, నరేష్ లాంటి సీనియర్ల వల్ల ఎమోషన్ యాంగిల్‌లో చేసిన చిన్నచిన్న మార్పులు పండాయి. నిర్మాతలు మాత్రం ఖర్చుకు వెనకాడకుండా సినిమా నిర్మించారు. వాళ్ల ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా మొత్తం ఆకట్టుకుంటాయి.
చాలా రీమేక్స్‌కు జరిగినట్టుగానే ఫస్ట్ ర్యాంక్ రాజు రీమేక్‌కు కూడా జరిగింది. కన్నడలో ఈ సినిమా హిట్. తెలుగులో సేమ్ టైటిల్‌తో రిలీజ్ చేసి ఇక్కడ కూడా హిట్ కొడదామనకున్నారు. కానీ ఆ ప్రయత్నంలో సగమే సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఒరిజినల్‌లో ఉన్న ఎమోషన్, ఫన్ తెలుగు వెర్షన్‌లో మిస్ అయింది.
ఫస్ట్ ర్యాంక్ రాజులో చాలా ఫన్ ఉంది. కానీ అలాంటి కామెడీని ఎంజాయ్ చేసే స్థాయిని ఎప్పుడో తెలుగు ప్రేక్షకుడు దాటేశాడు. ఈ విషయంలో మేకర్స్ కాస్త క్రియేటివ్‌గా ఆలోచించాల్సింది. రీమేక్‌ను ఎందుకు కెలకడం అనుకున్నారేమో, కామెడీని కూడా నాలుగేళ్ల కిందటి ఒరిజినల్ నుంచే తీసుకున్నారు. ఈ విషయంలో దర్శకుడు నరేష్ కుమార్ కాస్త అప్‌డేట్ అయితే బాగుండేది. అక్కడక్కడ నవ్వు తెప్పించినా, తెలుగు ఆడియన్స్‌కు మాత్రం ఈ కామెడీ కిక్ ఇవ్వదు.
చిక్కంతా ఎక్కడొచ్చిందంటే కామెడీలో చేయాల్సిన మార్పుల్ని ఎమోషన్‌లో చేయడం. రావు రమేష్, సీనియర్ నరేష్, ప్రకాష్ రాజ్ లాంటి ఆర్టిస్టులు ఉన్నారని.. ఈ యాంగిల్‌లో ఎక్కువ మార్పులుచేర్పులు చేసినట్టున్నారు. ఫలితంగా కామెడీ పండిస్తాడనుకున్న రాజు, సెకండాఫ్‌లో చాలా సీరియస్ అయిపోతాడు. అలా అని ఇది సినిమాకు ఏమైనా కలిసొస్తుందా అదే అది కూడా డౌటే.
పుస్తకాల పురుగు పాత్రలో చేతన్ బాగానే చేశాడు కానీ అతడి యాక్టింగ్‌లో లోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా రొమాంటిక్ యాంగిల్‌లో చేతన్ ఇంకాస్త బెటర్‌గా చేయాల్సింది. ఇక హీరో పెద్ద ముద్దపప్పు అని తెలిసినా.. అతడి కోసం హీరోయిన్ చేస్తున్న ప్రయత్నాలు క్లిక్ అవ్వలేదు. మేకర్స్ ఫన్ అనుకున్నారు, ఆడియన్స్ ఇబ్బందిపడ్డారు.
ఒక్కోసారి రీమేక్‌కు ఎలాంటి మార్పులు చేయకూడదని భావించినా కూడా తప్పే అవుతుందని ఫస్ట్ ర్యాంక్ రాజు నిరూపించింది. కన్నడ ప్రేక్షకులకు ఇది నచ్చింది కానీ తెలుగు ప్రేక్షకులు ఇలాంటి క్యారెక్టరైజేషన్లు చాలా చూశారు. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిక్స్ చేస్తూ ఎడ్యుకేషన్ సిస్టమ్‌పై ఇచ్చిన సందేశం విషయంలో మాత్రం ఫస్ట్ ర్యాంక్ రాజు పాసయ్యాడు.
కన్నడ వెర్షన్‌లో ఎలాగైతే స్మూత్‌గా సందేశాన్ని అందించారో.. ఆ ఫీల్‌ను తెలుగు వెర్షన్‌లో కూడా తీసుకురాగలిగారు. చదువంటే కేవలం పుస్తకాలు కాదు, లోకజ్ఞానం కూడా అవసరమే అనే విషయాన్ని రాజు అనే పాత్ర ద్వారా అంతర్లీనంగా చెప్పారు. ఓవరాల్‌గా ఫస్ట్ ర్యాంక్ రాజు ఈ వీకెండ్ ఓ మోస్తరుగా మాత్రమే నవ్విస్తాడు
రేటింగ్ – 2/5
జీ సినిమాలు సౌజన్యంతో..