ఉదయపూర్ ప్రాంతానికి చెందిన 59 సంవత్సరాల బీజేపీ ఎమ్మెల్యే ఫూల్ సింగ్ మీనా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. చిన్నప్పుడు తన కుటుంబ పరిస్థితుల వల్ల, తండ్రి మరణించడం వల్ల బాధ్యతలను భుజాన వేసుకోవడానికి చదువుకి స్వస్తి పలకాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచాక.. తన కుమార్తెల ప్రోత్సాహంతో తొలిసారిగా 2013లో పదవ తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. అయినా బిజీ షెడ్యూల్ వల్ల 2013లో దరఖాస్తు చేసుకున్నా.. 2016లో పరీక్షలు రాసి పాసయ్యానని ఆయన అన్నారు.
అయితే పదవ తరగతి పరీక్షలతోనే తాను సరిపెట్టుకోలేదని.. 2017లో పన్నెండవ తరగతి పరీక్షలు కూడా రాసి పాసయ్యానని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన "బేటీ బచావో బేటీ పడావో" పథకంలో భాగంగా రాజస్థాన్‌లో ఎస్సీ, ఎస్టీ తరగతులకు చెందిన బాలికలను పాఠశాలల్లో చేర్పించడం కోసం ఏర్పాటు చేసిన క్యాంపెయిన్‌లో ఫూల్ సింగ్ మీనా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలికలకు విద్యా ప్రాధాన్యాన్ని చెబుతూ.. తాను కూడా 50 ఏళ్లు దాటినా కూడా పరీక్షలు రాశానని తెలిపారు. అందరూ చదువుకోవాలని.. జీవితంలో ముందుకు వెళ్లడానికి చదువు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
రాజస్థాన్‌లో పదవ, పన్నెండవ తరగతి పరీక్షల్లో 80 శాతం మార్కులు తెచ్చుకొనే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఫ్లైట్ జర్నీ చేసే అవకాశం కల్పిస్తుందని మీనా ఈ సందర్భంగా అన్నారు. తాను కూడా చదువు విషయంలో బాల బాలికలకు ఆదర్శంగా నిలవాలని భావిస్తున్నానని.. అందుకే ఈ సంవత్సరం బీఏ పరీక్షలకు కూడా హాజరు కానున్నానని మీనా తెలిపారు. ఈ రోజులలో అందరూ కనీసం డిగ్రీ వరకైనా చదువుకోవాల్సిన అవసరం ఉందని మీనా ఈ సందర్భంగా తెలియజేశారు.