ఈ టాలీవుడ్ దర్శకులు ఇంకా మీకు గుర్తున్నారా..!

ఒక సినిమాకి దర్శకత్వం వహించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో శ్రమకోర్చి కథను సిద్ధం చేసుకొని.. టెక్నీషియన్స్‌ను సమకూర్చుకొని.. నిర్మాత ఎలాంటి సినిమాను తన నుండి ఆశిస్తున్నాడో కూడా గుర్తుపెట్టుకొని డైరెక్టర్ సినిమాను తీయాల్సి ఉంటుంది. 

Last Updated : Aug 13, 2018, 02:08 PM IST
ఈ టాలీవుడ్ దర్శకులు ఇంకా మీకు గుర్తున్నారా..!

ఒక సినిమాకి దర్శకత్వం వహించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో శ్రమకోర్చి కథను సిద్ధం చేసుకొని.. టెక్నీషియన్స్‌ను సమకూర్చుకొని.. నిర్మాత ఎలాంటి సినిమాను తన నుండి ఆశిస్తున్నాడో కూడా గుర్తుపెట్టుకొని డైరెక్టర్ సినిమాను తీయాల్సి ఉంటుంది. అందుకే సినిమా డైరెక్టర్‌నే తాను తీసే సినిమాకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు. ఒక సినిమాను తీయడం అనేది ఒక పెద్ద ప్రహసనం అయితే.. అది హిట్ అవ్వడం అనేది మరో పెద్ద సమస్య.

ఎందుకంటే అందరూ హిట్ సినిమా తీయాలనే అనుకుంటారు. ఫ్లాప్ సినిమా తీయాలని ఏ డైరెక్టర్ కూడా కోరుకోడు. మంచి ట్రెండ్ సెట్టింగ్ సినిమా తీసినా సరే.. ఆ తర్వాత అవకాశాలు దక్కని దర్శకులు చాలామందే ఉన్నారు.

సాంకేతికంగా బ్రిలియంట్ సినిమా తీసినా సరే.. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో మరో ఛాన్స్ దొరకని దర్శకులు కూడా ఉన్నారు. అలాగే కేవలం తమ కెరీర్‌లో ఒకే ఒక సూపర్ హిట్ చిత్రం ఇచ్చి ఆ తర్వాత చాలాకాలంగా మరో హిట్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకులు కూడా ఉన్నారు. అలాగే వివిధ కారణాల వలన.. పరిస్థితుల ప్రభావం వలన ఇండస్ట్రీ కోల్పోయిన దర్శకులు.. ఇండస్ట్రీకి దూరమైన దర్శకులు కూడా కొంతమంది ఉన్నారు.  అలాంటి దర్శకుల్లో పలువురి గురించి మనం కూడా తెలుసుకుందాం..!

భరత్ పారేపల్లి (తపస్సు) - తళుకుమన్నది కులుకుల తార.... పలుకుతున్నది వలపు సితార... 1990ల్లో ప్రేమికుల గుండెలను ఊలలాడించిన పాట ఇది. 1994లో వచ్చిన "తపస్సు" సినిమాలోది ఈ గీతం. భరత్, కృష్ణభారతి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద ట్రెండ్ సెట్టర్... అలాగే పెద్ద హిట్ చిత్రం. ఇదే డైరెక్టర్ ఆ తర్వాత తెలంగాణ, ఫిల్మ్ నగర్, గురి లాంటి సినిమాలు తీశారు . కానీ అవేవీ "తపస్సు" సినిమా స్థాయి విజయాన్ని ఇవ్వలేదు. ముమైత్ ఖాన్ హీరోయిన్‌గా వచ్చిన "మైసమ్మ ఐపీఎస్" చిత్రం కూడా ఈయన తీసిందే. దాసరి ప్రియ శిష్యుడైన భరత్ ఈ మధ్యకాలంలో పెద్దగా చెప్పుకోదగ్గ హిట్ చిత్రాలేవీ తీయలేదు.  

గీతాక్రిష్ణ (కోకిల) - 1987లో నాగార్జున హీరోగా నటించిన "సంకీర్తన" చిత్రం ద్వారా మెగాఫోన్ పట్టిన గీతాకృష్ణకి ఆ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత 1990లో నరేష్‌ను హీరోగా పెట్టి తీసిన "కోకిల" చిత్రం గీతాకృష్ణ కెరీర్ లోనే పెద్ద హిట్ చిత్రమని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఆయన తీసిన కీచురాళ్లు, ప్రియతమ, కాఫీబార్ లాంటి చిత్రాలు ఆయనకు మళ్లీ "కోకిల" స్థాయి విజయాన్ని అందించలేదు. గతకొంత కాలంగా గీతాకృష్ణ సినిమాలు ఏవీ తీయడం లేదు. 

ఉప్పలపాటి నారాయణరావు (రక్షణ) - అక్కినేని నాగార్జున తీసిన "జైత్రయాత్ర" చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన ఉప్పలపాటి నారాయణరావు... తర్వాత నాగార్జున నటించిన "రక్షణ" చిత్రం ద్వారా తొలి హిట్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన తీసిన తీర్పు, పాతబస్తీ, మైనా, వీడు సామాన్యుడు కాదు, యువరత్న లాంటి చిత్రాలు ఆయనకు మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందివ్వలేదు. 

పి.ఏ.అరుణ్ ప్రసాద్ (తమ్ముడు) - పవన్ కళ్యాణ్‌తో "తమ్ముడు" లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన పి.ఏ.అరుణ్ ప్రసాద్... ఆ తర్వాత శత్రువు, గౌతమ్ ఎస్‌ఎస్‌సీ, మా నాన్న చిరంజీవి లాంటి తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే కానీ అవేవీ ఆయనకు మళ్లీ  "తమ్ముడు" సినిమా అందించిన సూపర్ హిట్ స్థాయి విజయాన్ని అందివ్వలేదు. 

ఎస్ జే సూర్య (ఖుషీ) - పవన్ కళ్యాణ్‌తో "ఖుషీ" లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన ఎస్ జే సూర్య.. చాలాకాలంగా మరో సూపర్ హిట్ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన  "ఖుషీ" విడుదలైన తర్వాత తీసిన నాని, పులి చిత్రాలు కూడా బాక్సాఫీసు వద్ద చతికిలబడడంతో ఆయన కొంతకాలంగా తెలుగు చిత్రాలకు దూరంగా ఉన్నారు. 

నీలకంఠ (మిస్సమ్మ) - అంతర్జాతీయంగా కూడా గుర్తింపు తెచ్చుకున్న "షో" సినిమా ద్వారా తెలుగులో దర్శకుడిగా పరిచయమైన నీలకంఠ.. శివాజీ హీరోగా నటించిన "మిస్సమ్మ" సినిమాతో తొలి సూపర్ హిట్ కైవసం చేసుకున్నారు. ఆ చిత్రం తర్వాత ఆయన తీసిన సదా మీ సేవలో, నందనవనం 120 కిలోమీటర్లు, మిస్టర్ మేధావి, విరోధి, మాయ లాంటి చిత్రాలు ఆయనకు తిరిగి మళ్లీ "మిస్సమ్మ" లాంటి విజయాన్ని అందించలేకపోయాయి. 

కాశీ విశ్వనాథ్ (నువ్వులేక నేను లేను) - 2003లో కళ్యాణ్ రామ్ తొలిచిత్రం "తొలిచూపులోనే"తో దర్శకుడిగా పరిచయమైన కాశీ విశ్వనాథ్ ఆ తర్వాత తరుణ్ నటించిన "నువ్వు లేక నేను లేను" చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన ఏ చిత్రానికి కూడా డైరెక్షన్ చేయకపోవడం గమనార్హం. 

సూర్యకిరణ్ (సత్యం) - 2003లో విడుదలైన "సత్యం" సినిమాతో సూపర్ హిట్ కైవసం చేసుకున్న సూర్యకిరణ్ ఆ తర్వాత ధన 51, రాజుభాయ్ లాంటి సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. చాలాకాలంగా మరో హిట్ కోసం వెయిట్ చేస్తున్న దర్శకుల్లో సూర్యకిరణ్ కూడా ఒకరు. 

పోసాని కృష్ణమురళి (ఆపరేషన్ దుర్యోధన)  - రచయితగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ, డైలాగ్స్ అందించిన పోసాని కృష్ణమురళి కూడా తన కెరీర్‌‌లో ఇచ్చిన ఏకైక హిట్ చిత్రం "ఆపరేషన్ దుర్యోధన". ఆ తర్వాత ఆయన తీసిని చిత్రాలేవీ ఆయనకు మళ్లీ ఆ స్థాయి హిట్ చిత్రాన్ని ఇవ్వలేదు.

షిండే (నిన్నే ప్రేమిస్తా) - అక్కినేని నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య తారాగణంగా నటించిన "నిన్న ప్రేమిస్తా" చిత్రం ఎంత పెద్ద హిట్ చిత్రమో తెలియంది కాదు. అయితే ఈ చిత్రం తర్వాత షిండే ఏ ఇతర తెలుగు చిత్రానికి కూడా దర్శకత్వం వహించలేదు. అయితే ఆయన చాలా సినిమాలకు కో డైరెక్టరుగా పనిచేశారు. 2001లో షిండే క్యాన్సర్‌తో మరణించడంతో మంచి దర్శకుడిని టాలీవుడ్ కోల్పోయినట్లయింది. 
 

Trending News