Dexamethasone to treat COVID-19: కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిశోధనలు సత్ఫలితాలనిస్తూ... ఒక్కొక్కటిగా అందుబాటులో ఉన్న మందులకు పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నాయి. మొన్న ఫావిపిరవిర్( Favipiravir ), నిన్న రెమిడెసివర్( Remdesivir ).. ఇక ఇప్పుడు డెక్సో మెధసోన్( Dexamethasone ) ఆ జాబితాలోకి వచ్చి చేరింది. కరోనావైరస్ చికిత్సకు ఇప్పుడు మరో మందు అందుబాటులోకి వచ్చింది. కొత్తగా కనుగొన్న మందు కాకపోయినా.. కోవిడ్-19 చికిత్సలో సత్ఫలితాలనిస్తుండటంతో... కేంద్ర ప్రభుత్వం ఆ మందుకు అనుమతిచ్చింది. ఆర్ధరైటిస్, ఆస్థమా వంటి తీవ్ర వ్యాధుల్లో ఉపయోగించే డెక్సామెధసోన్ ( Dexamethosone )ను కరోనా చికిత్సలో ఉపయోగించుకోవచ్చని కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. కరోనాతో బాధపడుతూ వెంటిలేటర్‌పై ఉన్నవారికి ప్రస్తుతం మిథైల్ ప్రెడ్నిసలోన్ను ఇస్తున్నారు. ఇది కాస్త ఖరీదైంది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ ధరకు లభించే డెక్సామెధసోన్ను ఉపయోగించవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
బ్రిటన్‌లో జరిగిన అనేక క్లినికల్ ట్రయల్స్‌లో ఫలితాలు సానుకూలంగా వచ్చిన తరువాత ఈ స్టెరైడ్ ఉత్పత్తిని పెంచాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోరింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీకు చెందిన ఓ బృందం దాదాపు 2 వేల మంది కరోనా రోగులకు ఈ మందును ఇచ్చారు. వెంటిలేటర్ల ద్వారా చికిత్స పొందుతున్నవారి మరణాల రేటును ఈ మందు 35 శాతం తగ్గించింది. దాదాపు 60 ఏళ్ల నుంచి మార్కెట్లో ఉన్న డెక్సామెధసోన్ 2 మిల్లీగ్రాముల టాబ్లెట్ ( Dexamethasone tablet ) మార్కెట్లో ఒక్కొక్కటి కేవలం 30 పైసలకే లభిస్తుంది. అటు దీనికి సంబంధించిన ఇన్జెక్షన్ 3-4 ( Dexamethasone injection ) రూపాయలకు దొరుకుతోంది.