డియర్ జిందగీ: "కాలా" అనేది ఒక వెలుగు లాంటి ఆత్మకథ

"కాలా" సినిమా మనకు మానవులు మానవుల వలే ఆలోచించాలనే సందేశాన్ని ప్రేమతో అందిస్తోంది. మానవుడు కేవలం మానవుడే తప్పితే ఏదో గొప్ప అవతారం కాదన్న సత్యాన్ని కూడా చెబుతుంది. ఇది ఒక సామాన్యుడి తర్కం. అంతేకాదు.. ఒక నమ్మకం, విశ్వాసానికి సంబంధించిన కథ ఇది. 

Last Updated : Jun 26, 2018, 04:05 PM IST
 డియర్ జిందగీ: "కాలా" అనేది ఒక వెలుగు లాంటి ఆత్మకథ

దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ

రజనీకాంత్ నటించిన "కాలా- కరికాలుడు" అనేది ఒక సినిమా. కానీ  "కాలా" కథను ఒక సినిమా కథగానే మనం సరిపెట్టుకోలేం. ఈ సినిమాలో రాజనీతితో పాటు నిజ జీవితపు రంగులు ప్రతీ ఫ్రేములో మనకు దర్శనమిస్తాయి. ఇదే చిత్రాన్ని మనం మన హృదయంతో చూడడంతో పాటు.. అందులో అంశాలను మెదడు పెట్టి ఆలోచించగలిగితే.. నిజంగానే ప్రతీ మనిషి జీవితాన్ని మార్చగల గొప్ప సూత్రాలను ఈ చిత్రం అందించిందని చెప్పగలుగుతాం. 

కాలా కథలోనే మనకు అనేక ఉపకథలు కనిపిస్తాయి. అలాగే ఆ పాత్రలో కనిపించే వైఖరులు కూడా మనల్ని సమ్మోహితుల్ని చేస్తాయి. నేను సినిమా సమీక్షకుడిని కాదు. సినిమా రంగంలో నిపుణుడిని కూడా కాదు. అందుకే ఈ సినిమాకి సంబంధించి సినిమా కోణంలో కాకుండా.. ఈ సినిమా మన జీవితాలను ఎలా ప్రభావితం చేయగలదు అన్న అంశం మీద చర్చించదలిచాను. ఈ సినిమా జీవితాలను ఎలాంటి కొత్త కోణాల ద్వారా చూడమని చెప్పిందో కూడా చెప్పదలిచాను. 

1. "కాలా" సినిమాలో కథానాయకుడి పాత్ర ద్వారా ఈ రోజుల్లో కూడా కొందరు ప్రజలు ఇంకా ఏ విధంగా వర్ణ వివక్ష బారిన పడుతున్నారో తెలియజేశారు. నల్ల రంగు పట్ల కొందరు ఏహ్యభావం పెంచుకోవచ్చు గానీ.. కథానాయకుడికి మాత్రం తన రంగుపై ఎలాంటి హీనభావమూ ఉండదు. పైగా గర్వం ఉంటుంది. తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలనే తెగువ ఉంటుంది. ఆ తెగువే అతని నోటి నుండి కొన్ని అర్థవంతమైన సంభాషణలు వచ్చేలా చేస్తుంది. ఇలాంటి అర్థవంతమైన సంభాషణలను నేను ఇప్పటి వరకూ ఏ ఇతర సినిమాలోనూ చూడలేదు. హిందీ చిత్రాలు కూడా దానికి మినహాయింపు కాదు. ఈ విషయంపై మీవద్ద ఏ ఇతర సమాచారమున్నా నాతో నిరభ్యంతరంగా పంచుకోవచ్చు. 

2."కాలా" ఒక దళిత నేపథ్యమున్న చిత్రం. ఇందులో కరికాలుడు తన రాజనీతికి సంబంధించిన మాటలను చాలా చక్కగా చెబుతాడు. అయినా సినిమా వాళ్లకు నచ్చని కొన్ని తప్పులు చేస్తాడు. కానీ అవన్నీ సగటు మానవుడు చేసే తప్పులే. ఈ చిత్రంలో హీరో ఒక సామాన్యుడు. ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకుంటాడు. అతనికి ఒక కుటుంబం ఉంటుంది. పిల్లలు ఉంటారు. ఎంత గొప్ప ప్రజల మనిషి అయినా.. కుటుంబంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులనూ పరిష్కరించడంలో విఫలమవుతాడు.

ఈ క్రమంలో.. అతని కుటుంబానికి అతను చేసే పనులు కొన్ని తప్పులగానే కనిపిస్తాయి. ఇలాంటి అంశాలు సగటు బాలీవుడ్ చిత్రాలలో చాలా తక్కువగా కనిపిస్తాయి. ఖరీదైన జీవితాలతో కూడిన సినిమా కథలతో పోల్చుకుంటే.. "కాలా" సామాన్య మానవుల కోసం తీసిన సామాన్య కథ. "కాలా" సినిమా మనకు మానవులు మానవుల వలే ఆలోచించాలనే సందేశాన్ని ప్రేమతో అందిస్తోంది. మానవుడు కేవలం మానవుడే తప్పితే ఏదో గొప్ప అవతారం కాదన్న సత్యాన్ని కూడా చెబుతుంది. ఇది ఒక సామాన్యుడి తర్కం. అంతేకాదు.. ఒక నమ్మకం, విశ్వాసానికి సంబంధించిన కథ ఇది. 

3.అసలు భారతదేశంలో వర్ణభేదం అనే అంశమే చాలా సున్నితమైన అంశం. సినిమాలలో కూడా కాస్త అందంగా, రంగు బాగా ఉండే వ్యక్తులనే నాయకులుగా, కథానాయకులుగా చూపిస్తుంటారు. ఈ రంగు అనేది వివాహాలకు కూడా అతీతం కాదు. తమ అస్తిత్వాన్ని మర్చిపోయి నల్లగా ఉండే అబ్బాయిలు కూడా తెల్లగా ఉండే అమ్మాయిలనే వివాహం చేసుకోవాలని భావిస్తుంటారు. వర్ణం అనేది నేడు ఒక వేలంవెర్రి సంప్రదాయంలో భాగమైపోయింది. 

4.ఇటీవలే నైనా మజుందార్ అనే పాఠకురాలు "డియర్ జిందగీ"తో తన ఆలోచనలు పంచుకుంటూ ఈ విధంగా రాశారు. తన రంగు పట్ల తాను ఆకర్షితురాలవ్వడం జరుగుతుందని.. తన రంగు నుండి తాను వేరు కాలేకపోతున్నానని ఆమె అన్నారు. తన దేహఛాయ తెలుపు వర్ణంలో ఉంటేనే.. దానిని ప్రేమించగలనని ఆమె అన్నారు. నైనా భర్త ఆమె కన్నా కాస్త రంగు తక్కువ.

అయితే అతనితో ఆమె జీవితం సుఖంగానే సాగిపోతోంది. అయినప్పటికే.. ఆయన ఇంకాస్త తెల్లగా ఉంటే బాగుంటుందని ఆశించడంలో తప్పు లేదు కదా.. అని ఆమె అన్నారు. నేను ఆమెకు ఈ విధంగా జవాబిచ్చాను. "ఈ సమస్య ఇంకాస్త బాగుంటే సరిపోతుంది కాదు కదా..! అనుకొనే విషయం కాదు. వర్ణం గురించి మాట్లాడడం అంటేనే ఇతరుల పట్ల అగౌరవం కలిగి ఉండడం. వారి పట్ల అన్యాయంగా ప్రవర్తించడం మరియు వారిని ప్రేమించలేకపోవడం. కేవలం వ్యక్తిత్వాన్ని బట్టి కాకుండా రంగు ఆధారంగా ఎవరినీ బేరీజు వేయడం తగదు" అన్నదే ఆమెకు నా సమాధానమైంది.

5."కాలా" సినిమాలో కూడా కథానాయకుడు ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తాడు. రంగు అనేది ప్రకృతి అందిస్తోంది. మానవుడి ప్రమేయం లేని అంశం అది. కానీ.. అంతకంటే ముఖ్యమైంది వర్ణరహితమైన ఆలోచన విధానాన్ని పెంచుకోవడం. ఈ విధంగా చూస్తే.. వర్ణ వివక్ష బారిన పడిన వారికి కూడా.. రంగును కేవలం జీవన మరణ సమస్యగా చూడడం తర్కహీనమని చెప్పవచ్చు. 

కొన్ని మూసధోరణితో కూడిన ఆలోచనల ముందు "కాలా" అనే పదం సవాలు కానే కాదు. అలాంటి ఆలోచనలపై పోరాటం చేయడమే దాని లక్ష్యం. వర్ణవివక్ష అనే చట్రంలో చిక్కుకుపోయిన వారు అది ఎంత ఘాతకమైందో తెలుసుకుంటే చాలు. 

ఈ విషయాన్ని చిత్రంలో తన పాత్ర ద్వారా బహిర్గతం చేసిన రజనీకాంత్‌కి మనం కృతజ్ఞులమై ఉండాలి. శతాబ్దాలుగా సమాజంలో అంతర్భామై ఉన్న ఓ సమస్యకు పరిష్కారం అందించే దిశగా ఆయన ఈ చిత్రంలోని తన పాత్ర ద్వారా శ్రీకారం చుట్టడం విశేషం. 

ఈ ఆర్టికల్‌ని హిందీలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి :-डियर जिंदगी : ‘काला’ उजाले की आत्‍मकथा है...
(https://twitter.com/dayashankarmi)

(ఈ ఆర్టికల్‌పై మీ సలహాలు, సూచనలు తెలియచేయండి: https://www.facebook.com/dayashankar.mishra.54)

Trending News