మెగాస్టార్ చిరంజీవి ఎట్టకేలకు తాను కూడా గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించారు. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఆయన ఇంటి పెరటిలో మూడు మొక్కలు నాటారు. ఆ తర్వాత ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తర్వాత తాను కూడా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు, తన సోదరుడు పవన్ కళ్యాణ్‌కు, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ హరితాహారం పథకంలో భాగంగా ఆ రాష్ట్రంలో ప్రారంభమైన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో పాపులారిటీని సంపాదించుకుంది.
ప్రముఖులు, సెలబ్రిటీలు అందరూ ఈ గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ప్రారంభించారు. ఇటీవలే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తాను మొక్కలు నాటుతూ .. ఆ తర్వాత మొక్కలు నాటమని కోరుతూ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు ఛాలెంజ్ విసిరారు. అయితే కేటీఆర్‌కు ఆ ఛాలెంజ్ చేసింది సినీ దర్శకుడు రాజమౌళి కావడం విశేషం. రాజమౌళి కూడా ఆ ఛాలెంజ్‌ను ఎంపీ కల్వకుంట్ల కవిత నుండి స్వీకరించారు.
గ్రీన్ ఛాలెంజ్ అనేది తెలంగాణలో హరితాహారం పథకాన్ని ప్రమోట్ చేయడం కోసం తొలుత ప్రారంభించారు. 2015లో తెలంగాణ ప్రభుత్వం హరితహారంలో భాగంగా రికార్డు స్థాయిలో హైదరాబాద్ నగరంలో ఒక్కరోజులోనే 25 లక్షల మొక్కలు నాటి వార్తల్లో నిలవడం జరిగింది. ఇదే హరితహారం పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ రెండు గ్రామాలకు ఒక నర్సరీ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,213 నర్సరీలు ఏర్పాటుచేశారు.
హరితహారం పథకంలో భాగంగా ప్రభుత్వం అటవీ ప్రాంతంలోనే కాకుండా అన్ని రహదారులకు ఇరువైపులా, విద్యాలయాల్లో, పోలీస్ ప్రాంగణాల్లో, మార్కెట్ యార్డుల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, శ్మశాన వాటికలు, గ్రేవ్ యార్డుల్లో, పరిశ్రమల్లో, పారిశ్రామిక వాడల్లో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కూడా మొక్కలు నాటే ఏర్పాటు చేయడం గమనార్హం.
రామోజీ,పవన్‌లకు చిరు ఛాలెంజ్