ఆయుర్వేద పద్దతితో కోళ్లను పెంచి రుచికరమైన గుడ్లను అందిస్తున్నారు రావులపాలెంకు చెందిన చిన్నం హర్షవర్ధన్ రెడ్డి. ఈ యువకుడు అమెరికాలో ఎంబీఏ విద్యను పూర్తిచేసి తండ్రి అండతో కోళ్ల వ్యాపారాన్ని ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా ఆయన తండ్రి కోళ్ల ఫారాలను నిర్వహిస్తుండగా.. ఆరేళ్ల కిందట కొడుకు హర్షవర్ధన్ రెడ్డి సౌభాగ్య గ్రూప్ పేరుతో ఒక పౌల్ట్రీ పరిశ్రమను ప్రారంభించి విన్నూతంగా కోళ్లను పెంచడం ప్రారంభించారు. ఆ కోళ్లకు ఎటువంటి రసాయన మందులు వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అల్లం, వెల్లుల్లి, పసుపు, తులసి, ఉసిరి, మునగ, మొక్కజొన్న, సోయా, పిప్పళ్లపొడి తదితర 40 రకాల ఆహార పదార్థాలతో ఆహారాన్ని తయారుచేసి కోళ్లకు ఇస్తున్నారు. దీనివల్ల కోళ్లలో ఎలాంటి రసాయన ప్రభావం కనిపించదని, గుడ్లలోనూ ఆయుర్వేద లక్షణాలు కనపడతున్నాయని హర్షవర్థన్ రెడ్డి తెలిపారు. ఈ గుడ్లకు బహిరంగ మార్కెట్ లో మంచి గిరాకీ ఉందని కూడా చెప్పారు.
అయితే, బయట గుడ్డు ధర 4-5 రూపాయలు ఉంటే.. ఈ కోళ్ల గుడ్ల ధరలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం సౌభాగ్య గ్రూప్‌లో దేశీ, ఆయుర్ ప్లస్ అనే రెండు రకాల కోళ్లను పెంచుతున్నారు. వీటిలో దేశీ కోళ్ల గుడ్డు ధర ఒక్కోటి రూ.21.50 కాగా, ఆయుర్ ప్లస్ కోళ్ల గుడ్డు ధర రూ. 12.50గా ఉంది. కిలో రూ.480లకు హైదరాబాదులో మాత్రమే ఈ కోళ్ల మాంసాన్ని అమ్ముతారు.
ప్రస్తుతం ఈ కోళ్ల ఫారంలో 35 వేల కోళ్లను పెంచుతున్నారు. దాదాపు రోజుకి 25-26 వేల గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని తెలుగు రాష్ట్రాలలో ఉన్న పట్టణాలకు, హైదరాబాదు, బెంగళూరు ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. భవిష్యత్తులో వీటిని దేశవ్యాప్తంగా ఎగుమతి చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు హర్షవర్ధన్ తెలిపారు.
రుచికరమైన ఆయుర్ గుడ్లు వచ్చేశాయ్..!