ముంబై: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఎక్కడికక్కడే చిక్కుకు పోయిన వలస కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యింది. లాక్డౌన్ కారణంగా కార్మికులు గత నెలలకు పైగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వం శ్రామిక్ రైళ్ల (Shramik trains ) సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ సమస్యలు తీరడం లేదు. అయితే ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ ప్రాముఖ్లు ఇప్పటికే వలస కూలీల కోసం అనేక బస్సులను ఏర్పాటుచేస్తున్నారు. కాగా సోనూసూద్ శుక్రవారం కేరళ నుండి కార్మికులను ఉత్తరప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు ఏకంగా విమానాన్నే నడిపి తన దాతృత్వాన్ని మరోసారి చాటుకొన్నారు.
Also Read: ఏపీలో కొత్తగా 70 కేసులు..!!
మరోవైపు మహారాష్ట్రలోని వలస కార్మికుల ఇబ్బందులను ఒక అభిమాని పంపిన ట్విట్టర్ మెసేజ్ ద్వారా తెలుసుకొన్న బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ వారికి అండగా నిలిచారు. వీరి కోసం 10 బస్సులను ఏర్పాటుచేసి వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఈ 10 బస్సుల ద్వారా దాదాపు 275 మందిని ఉత్తరప్రదేశ్‌కు తరలించారు. వీరిలో ఎక్కువగా అలహాబాద్, బనారస్, ఘోరక్‌పూర్‌కు చెందినవారు ఉన్నారని, ముంబైలోని మహాలక్ష్మి రేస్ కోర్సు నుండి బస్సులను ఏబీ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజేశ్ యాదవ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సుల్లో వలసకార్మికులకు అవసరమైన ఆహారపదార్థాలు అందించారు. వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు అవసరమైన మరిన్ని బస్సులు ఏర్పాటుచేస్తామని, అనుమతివ్వగానే రైళ్ల ద్వారా కూడా పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన వలస కార్మికులకు భరోసానిచ్చారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..