బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్..?

టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తు్న్నాడని ప్రచారం జరుగుతోంది. 

Last Updated : Sep 7, 2018, 07:13 PM IST
బాలీవుడ్ సినిమాలో నటిస్తున్న అల్లు అర్జున్..?

టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఓ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. 1983 క్రికెట్ వరల్డ్‌కప్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో క‌పిల్ దేవ్ పాత్రని ర‌ణ‌వీర్ సింగ్ పోషించే అవకాశం ఉండగా.. మరో లెజెండరీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కోసం ఓ దక్షిణాది నటుడి అన్వేషణలో నిర్మాతలు ఉండగా.. ఆఖరికి ఆ పాత్రకి అల్లు అర్జున్ పేరు ఖరారు అయ్యిందని వార్తలు వస్తున్నాయి. కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుందని వినికిడి. 2020 ఏప్రిల్ 10వ తేదిన (కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

ఇదే చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ భారత జట్టుకి కోచ్ పాత్రలో నటిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. 2018లో అల్లు అర్జున్ నటించిన ఏకైక చిత్రం "నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా" మాత్రమే. ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. అలాగే "సైరా" చిత్రంలో కూడా ఓ చిన్న పాత్రలో నటిస్తున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం తెలుగుతో పాటు మలయాళంలో కూడా మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ డబ్బింగ్ చిత్రాలు హిందీలో కూడా విడుదల అవ్వడంతో.. యూట్యూబ్‌‌లో కూడా బన్నీకి ఎక్కువ మంది ఫాలోవర్లు ఏర్పడడం గమనార్హం.

ఈ క్రమంలో అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే ఈ విషయమై బన్నీ నుండి ఎలాంటి అధికారిక సమాచారం కూడా రాలేదు. చిత్రమేంటంటే... గత సంవత్సరం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కపిల్ దేవ్ స్వయంగా అల్లు అర్జున్‌ని కలిశారట. మరో విచిత్రమేంటంటే.. కపిల్ దేవ్‌కి అల్లు అర్జున్ నటించిన "రేసుగుర్రం" చిత్రమంటే చాలా ఇష్టమట. ఆ మాట అతనే అన్నారని సమాచారం. అలాగే గత సంవత్సరం "గోల్ మాల్ ఎగైన్" షూటింగ్ సెట్స్‌లో బాలీవుడ్ టాప్ డైరెక్టర్ రోహిత్ శెట్టిని కూడా కలిశారు అల్లు అర్జున్. ఈ క్రమంలో అల్లు అర్జున్ బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం ఉందని వస్తున్న వార్తల్లో కూడా నిజముండే అవకాశం ఉందని అంటున్నారు పలువురు చిత్ర విశ్లేషకులు.

Trending News