మహేష్ బాబు సినిమా సెట్‌లో అల్లరి నరేష్ పుట్టినరోజు వేడుకలు

మహేష్ బాబు, అల్లరి నరేష్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ప్రస్తుతం డెహ్రాడూన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నరేష్ ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు.

Last Updated : Jul 1, 2018, 04:11 PM IST
మహేష్ బాబు సినిమా సెట్‌లో అల్లరి నరేష్ పుట్టినరోజు వేడుకలు

మహేష్ బాబు, అల్లరి నరేష్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ప్రస్తుతం డెహ్రాడూన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నరేష్ ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా సెట్‌లోనే నిన్న అల్లరి నరేష్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఆ వేడుకలకు సంబంధించిన ఫోటోలను యూనిట్ సభ్యులు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ప్రస్తుతం పేరు పెట్టని ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా... దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. గత కొంతకాలంగా అల్లరి నరేష్‌కు సరైన హిట్ లేని సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సోలో హీరోగా కాకుండా, మల్టీ స్టారర్ సినిమా చేయడం విశేషం. మహేష్, నరేష్ ఇద్దరూ కూడా గతంలో మల్టీస్టారర్ సినిమాలు చేసిన వారే. 

మహేష్, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" ఎంత పెద్ద హిట్ కొట్టిందో మనకు తెలియంది కాదు. అలాగే నరేష్, రవితేజ కాంబినేషన్‌లో గతంలో "శంభో శివ శంభో" చిత్రం వచ్చింది.

తాజాగా, మహేష్ బాబు, అల్లరి నరేష్ ఓ చిత్రంలో కలిసి నటిస్తున్నారనగానే ఆ ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘భరత్‌ అనే నేను’ సినిమా తర్వాత మహేష్ సైన్ చేసిన ఈ చిత్రాన్ని రైతు సమస్యలను ప్రధాన కథాంశంగా తీసుకొని తీస్తున్నారని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారు. 

Trending News