చెన్నై: భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించే టాప్ డైరెక్టర్స్, ఆయా చిత్రాలను నిర్మించే బడా నిర్మాతలకు పైరసీదారులు పెను సవాల్‌గా మారారు. ముఖ్యంగా దాదాపు రూ.540 కోట్లకుబైగా బడ్జెట్‌తో తెరకెక్కిన 2.0 మూవీని పైరసీ చేస్తామని విడుదలకు ముందే నిర్మాతలను హెచ్చరించి మరి సవాల్ విసిరిన తమిళ రాకర్స్ వెబ్సైట్.. చెప్పినట్టుగానే అన్నంత పనిచేసింది. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలైన రోజే పూర్తి నిడివి కలిగిన సినిమా వీడియో ఇంటర్నెట్లో ప్రత్యక్షమవడం చిత్రవర్గాలను ఆందోళనకు గురిచేసింది. తమ సినిమా పైరసీ బారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ గతంలోనే నిర్మాతలు మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. 2.0 చిత్ర నిర్మాతల విజ్ఞప్తి మేరకు 12,000 వైబ్‌సైట్స్ నిషేధించాల్సిందిగా 37 సర్వీస్ ప్రొవైడర్స్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదిలావుంటే, తాజాగా సదరు పైరసీదారులు 2.0 చిత్రాన్ని విడుదలైన రోజే పైరసీ చేసి, ఆ సినిమాకు సంబంధించిన ఫుల్ మూవీ వీడియో లింక్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నిర్మాతలకు షాక్‌ని ఇచ్చింది. ఇంత చేసినా తమ ప్రయత్నాలు ఫలించలేదే అని నిర్మాతలు వాపోయినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు రూ.540 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం కావడంతో విడుదలైన రోజే పైరసీ బారిన పడితే, పైరసీ ఎఫెక్ట్ తమకు ఎక్కడ భారీ నష్టాన్ని మిగుల్చుతుందోనని నిర్మాతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.