తెలుగు సినీ వినీలాకాశాన "నవలా" చిత్రాలు

తెలుగులో లబ్దప్రతిష్టులైన ఎందరో రచయితలు, నవలాకారులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో రచనలకు ఆదరణ తగ్గినా, ఒకప్పుడు ఆయా రచయితల నవలల ఆధారంగానే ఎన్నో చలనచిత్రాలు రూపొందాయి. ఇప్పటికీ అడపా దడపా నవలా సాహిత్యం వైపు తెలుగు సినిమా ఓ కన్ను వేస్తూనే ఉంది

Last Updated : Mar 9, 2018, 08:05 PM IST
తెలుగు సినీ వినీలాకాశాన "నవలా" చిత్రాలు

తెలుగులో లబ్దప్రతిష్టులైన ఎందరో రచయితలు, నవలాకారులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో రచనలకు ఆదరణ తగ్గినా, ఒకప్పుడు ఆయా రచయితల నవలల ఆధారంగానే ఎన్నో చలనచిత్రాలు రూపొందాయి. ఇప్పటికీ అడపా దడపా నవలా సాహిత్యం వైపు తెలుగు సినిమా ఓ కన్ను వేస్తూనే ఉంది. సినిమాగా తీయగల మంచి నవలా స్క్రిప్టు దొరికితే.. ఆయా నవలను తెరకెక్కించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు పలువురు దర్శకులు. ఈ క్రమంలో తెలుగు సినీ చరిత్రలో పలు నవలల ఆధారంగా తెరకెక్కిన సినిమాల గురించి మనం కూడా అవలోకనం చేసుకుందాం..!

బారిష్టరు పార్వతీశం - మొక్కపాటి నరసింహశాస్త్రి రచించిన హాస్య నవల 'బారిష్టరు  పార్వతీశం' చిత్రాన్ని 1940లో ఆర్.ప్రకాష్ సినిమాగా తెరకెక్కించారు. డ్రామా ఆర్టిస్టు లంక సత్యం ఈ చిత్రంలో పార్వతీశం పాత్రను పోషించారు. 

చదువుకున్న అమ్మాయిలు - 1963లో విడుదలైన ఈ చిత్రం డాక్టర్. శ్రీదేవి రచించిన 'కాలాతీత వ్యక్తులు' నవల ఆధారంగా తెరకెక్కింది. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, సావిత్రి, ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించారు. 

ఏకవీర - విశ్వనాథ సత్యనారాయణ కలం నుండి జాలువారిన 'ఏకవీర' చారిత్రక నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే 'ఏకవర'. ఎన్టీఆర్, కె.ఆర్.విజయ నటించిన ఈ చిత్రం 1969లో  విడుదలైంది.

చిల్లర దేవుళ్ళు - శ్రీ దాశరధి రంగాచార్య గారి కలం నుండి జాలువారి, సాహిత్య అకాడెమి అవార్డు పొందిన నవల ‘చిల్లర దేవుళ్ళు. ఈ చిత్రాన్ని 1976లో కాకతీయ పిక్చర్స్ వారు సినిమాగా రూపొందించారు. మేటి నటి సావిత్రితో పాటు పలువురు కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిత్రానికి టి.మధుసూదనరావు దర్శకత్వం వహించారు. 

ఒక చల్లని రాత్రి - డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు రాసిన నవల ఆధారంగా కె. వాసు దర్శకత్వంలో చంద్రమోహన్, మాధవి జంటగా ‘ఒక చల్లని రాత్రి’ అనే చిత్రం 1979లో విడుదలైంది.

సితార - దర్శకుడు వంశీ 'మహల్లో కోకిల' పేరుతో రాసిన నవలే 1983లో 'సితార' పేరుతో సినిమాగా తెరకెక్కింది. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతోనే నటి భానుప్రియ కథానాయకిగా తెలుగుతెరకు పరిచయమైంది.

అహ నా పెళ్లంట - రచయిత ఆదివిష్ణు ‘పల్లకి’ వార పత్రికలో రాసిన ‘సత్యంగారిల్లు’ నవల ఆధారంగా 1987లో వచ్చింది ఈ సినిమా. జంధ్యాల తనదైన మార్కు హాస్యంతో తెరకెక్కించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, రజని జంటగా నటించారు. 

ఏప్రిల్ 1 విడుదల - రచయిత కోలపల్లి ఈశ్వర్ "హరిశ్చంద్రుడు అబద్ధమాడితే" పేరుతో రాసిన నవలే ఆ తర్వాత 1991లో 'ఏప్రిల్ 1 విడుదల' పేరుతో సినిమాగా విడుదలైంది. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, శోభన హీరో హీరోయిన్లుగా నటించారు. 

పెద్ద మనుషులు - కొమ్మనాపల్లి గణపతిరావు రాసిన ‘శతదినోత్సవం’ నవల ఆధారంగా 1999లో బోయిన సుబ్బారావు దర్శకత్వంలో ‘పెద్ద మనుషులు’ చిత్రం తీశారు రామానాయుడు. సుమన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు. 

మధుమాసం - బలభద్రపాత్రుని రమణి రాసిన ‘నీకూ నాకూ మధ్య’ నవల ఆధారంగా ‘మధుమాసం’ అనే చిత్రం తీశారు దర్శకుడు చంద్రసిద్దార్థ్.  సుమంత్, స్నేహ జంటగా ఈ చిత్రంలో నటించారు. 2007లో విడుదలైంది ఈ సినిమా. 

ఇదీ సంగతి - రచయిత కె.ఎన్.వై పతంజలి కలం నుండి జాలువారిన 'మేరా భారత్ మహాన్' నవల ఆధారంగా దర్శకుడు చంద్ర సిద్దార్థ 2008లో 'ఇదీ సంగతి' పేరుతో ఒక చిత్రాన్ని తెరకెక్కించారు. అబ్బాస్, టబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. 

క్యాంపస్ (అంపశయ్య) - ప్రముఖ రచయిత అంపశయ్య నవీన్‌ 1969లో రాసిన నవల 'అంపశయ్య'. ఉస్మానియా విశ్వవిద్యాలయ హాస్టల్‌లో 16 గంటలు ఒక విద్యార్థి పడిన మానసిక సంఘర్షణే ఈ నవల. ఈ నవలను క్యాంపస్ (అంపశయ్య) పేరుతో 2016లో దర్శకుడు ప్రభాకర్ జైనీ కొత్త నటీనటులతో సినిమాగా తెరకెక్కించారు. 

ప్రముఖ రచయితలు - సినిమాలుగా తెరకెక్కిన వారి నవలలు

యద్ధనపూడి సులోచనారాణి నవలలు - ప్రముఖ రచయిత్రి యద్ధనపూడి సులోచనారాణి కలం నుండి జాలువారిన అనేక నవలలు అనేకం సినిమాలుగా వచ్చాయి. అందులో జీవన తరంగాలు, సెక్రటరి, విచిత్ర బంధం,  రాధాకృష్ణ, ఆత్మీయులు, ప్రేమలేఖలు, మీనా, బంగారుకలలు, అగ్నిపూలు, గిరిజా కళ్యాణం మొదలైనవాటిని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 'మీనా' చిత్రంతో నటి విజయనిర్మల దర్శకురాలిగా తెలుగుతెరకు పరిచయమయ్యారు. 

యండమూరి వీరేంద్రనాథ్ నవలలు - పాపులర్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ కలం నుండి జాలువారిన అనేక నవలలు కూడా సినిమాలుగా వచ్చాయి. అందులో అభిలాష, డబ్బు డబ్బు (ఛాలెంజ్), రక్తసింధూరం, ఒక రాధ ఇద్దరు కృష్ణులు, నల్లంచు తెల్లచీర (దొంగ మొగుడు), తులసీ దళం, తులసీ (కాష్మోరా), రాక్షసుడు, ఆఖరి పోరాటం, రక్తాభిషేకం, మరణ మృదంగం, రుద్రనేత్ర, థ్రిల్లర్ (ముత్యమంత ముద్దు), అగ్ని ప్రవేశం, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ మొదలైన చిత్రాలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 

కోడూరి కౌసల్యదేవి నవలలు - ప్రముఖ రచయిత్రి కోడూరి కౌసల్యదేవి కలం నుండి జాలువారిన పలు నవలలు కూడా సినిమాలుగా వచ్చాయి. అందులో డాక్టర్ చక్రవర్తి, ప్రేమనగర్, చక్రవాకం ప్రముఖమైనవి

పరుచూరి సోదరుల నవలలు - సినిమాల్లో రచయితలుగా రాణించక మునుపు పరుచూరి సోదరులు ఇద్దరూ కలిసి పలు నవలలు కూడా రాశారు. అందులో కొన్ని సినిమాలుగా కూడా వచ్చాయి. అటువంటి వాటిలో కార్తీక పౌర్ణమి, సర్పయాగం చిత్రాలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 

మల్లాది వెంకట కృష్ణమూర్తి నవలలు - ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి కలం నుండి జాలువారిన పలు నవలలు కూడా సినిమాలుగా వచ్చాయి. అందులో చంటబ్బాయి, ఝాన్సీరాణి, రెండు రెళ్లు ఆరు, తేనెటీగ, లక్కీఛాన్స్, గోల్ మాల్ గోవిందం ప్రముఖమైనవి. 2015లో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఛార్మీ ప్రధానపాత్రలో వచ్చిన 'జ్యోతిలక్ష్మి' చిత్రం కూడా మల్లాది నవల 'మిస్టర్ పరాంకుశం' ఆధారంగా తెరకెక్కిందే. 

మల్లిక్ నవలలు - ప్రముఖ కార్టూనిస్టు, రచయిత మల్లిక్ కలం నుండి జాలువారిన పలు రచనలు కూడా సినిమాలుగా వచ్చాయి. అందులో పరుగో పరుగు, మగరాయుడు, వివాహ భోజనంబు చిత్రాలు  ప్రముఖమైనవి. 

రంగనాయకమ్మ నవలలు - ప్రముఖ హేతువాద రచయిత్రి రంగనాయకమ్మ కలం నుండి జాలువారిన పలు రచనలు సినిమాలుగా వచ్చాయి. అందులో బలిపీఠం, గోరింటాకు, రాధమ్మ పెళ్లి, క్రిష్ణవేణి చిత్రాలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 

 

 

 

 

Trending News