తెలుగు సినీ రంగానికి సిసలైన 'సోగ్గాడు'..!

అందాల నటుడిగా తెలుగు రాష్ట్రాల్లో కితాబునందుకొని ఎందరో అభిమానులను సంపాదించుకున్న సున్నిత మనస్కుడు, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన హీరో శోభన్ బాబు

Last Updated : Jan 14, 2018, 06:27 PM IST
తెలుగు సినీ రంగానికి సిసలైన 'సోగ్గాడు'..!

ఉప్పు శోభనా చలపతిరావు.. ఈ పేరు వింటే మీరు ముక్కునవేలేసుకోవచ్చు. ఎవరై ఉంటారా? అని సందేహించవచ్చు . కానీ.. అదే సినీహీరో శోభన్ బాబు అసలు పేరు. ఇంట్లో పెట్టిన పేరు సంగతి ఎలాగున్నా.. చిత్రసీమలోకి రాగానే 'శోభన్' ఒక నటుడిగా తెచ్చుకున్న పేరు, ప్రఖ్యాతులు అన్నీ ఇన్నీ కావు. అందాల నటుడిగా తెలుగు రాష్ట్రాల్లో కితాబునందుకొని ఎందరో అభిమానులను సంపాదించుకున్న సున్నిత మనస్కుడు, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన హీరో శోభన్ బాబు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..!

*జనవరి 14, 1937 తేదిన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన శోభన్ బాబు, తాను మైలవరంలో హైస్కూల్లో చదువుతున్న రోజుల్లోనే నాటకాలపై మక్కువ పెంచుకున్నారు. గుంటూరు ఎ.సి.కాలేజిలో 'పునర్జన్మ' వంటి నాటకాలలో నటించి ప్రముఖుల మెప్పు కూడా పొందాడు.

*మద్రాసులో వెళ్లి లా కోర్సులో చేరినప్పటికీ.. నటన పైన ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టిన శోభన్, ఉదయం కాలేజీకి వెళ్ళి, మధ్యాహ్నం సినిమా అవకాశాల కోసం స్టూడియోల వెంట తిరిగేవాడు. తొలిసారిగా 'దైవబలం' చిత్రంలో రామారావు సరసన చాలా చిన్న పాత్రలో నటించిన శోభన్ బాబు అది అంతగా విజయం సాధించకపోవడంతో  భక్త శబరి అనే మరో చిత్రంలో నటించారు. 

*ఆ తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న వేషాల్లో నటించారు. ఆ తర్వాత సహాయక పాత్రల వైపు మళ్లారు. అభిమన్యుడిగా నర్తనశాలలో, అర్జునుడుగా భీష్మలో, లక్ష్మణుడుగా సీతారామకల్యాణంలో ఆయన పోషించిన పాత్రలు తనకు మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి. 

*హీరోగా శోభన్ బాబు నటించిన ' వీరాభిమన్యు' చిత్రం తనకు స్టార్ హోదాను కట్టబెట్టింది. ఆ సినిమా విడుదల అయ్యాక వరుసగా సినిమాలు చేశారు. బంగారు పంజరం, మనుషులు మారాలి, చెల్లెలి కాపురం, దేవాలయం, మల్లెపువ్వు, మానవుడు దానవుడు, సంపూర్ణ రామాయణం చిత్రాలు శోభన్ బాబులోని వైవిధ్యమైన నటుడిని లోకానికి పరిచయం చేశాయి.

*శోభన్ బాబుకు మే 15, 1958 తేదిన శాంత కుమారితో వివాహమైంది. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు.

*1970ల్లో వరుసగా నాలుగుసార్లు ఫిల్మ్‌ఫేర్ అందుకున్న ఏకైక నటుడు శోభన్‌బాబు. అలాగే తన కెరీర్‌లో అయిదు సార్లు నంది అవార్డు అందుకున్నారు.

*1980ల్లో శోభన్ బాబు అప్పటి తరం హీరోలకు కూడా గట్టి పోటీ అందించారు. శ్రావణ సంధ్య, దేవత, కార్తీక పౌర్ణమి, సంసారం, జైలుపక్షి, మహారాజు, మాంగల్యబలం, ఊరికి సోగ్గాడు ఆ కాలంలో ఆయన నటించిన కొన్ని ప్రముఖ చిత్రాలు

*1990ల్లో పలు మల్టీస్టారర్ సినిమాల్లో కూడా ఆయన నటించడం విశేషం. ముఖ్యంగా రాజశేఖర్‌తో కలిసి నటించిన బలరామక్రిష్ణులు, శోభన్ - బాలక్రిష్ణ కాంబినేషన్‌లో వచ్చిన అశ్వమేథం అందులో ప్రముఖమైనవి. అంతకు క్రితమే ఆయన చిరంజీవి, ఎన్టీఆర్, కృష్ణలతో కలిసి పలు మల్టీస్టారర్స్‌లో నటించారు. 

*శోభన్‌బాబు నటించిన సినిమాల్లో దాదాపు 95 శాతం పాటలు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడడం గమనార్హం.

*శోభన్‌బాబు తన కెరీర్‌లో దాదాపు 220 చిత్రాలకు పైగానే నటించారు. 1996లో విడుదలయిన 'హలో..గురూ' ఆయన నటించిన ఆఖరి చిత్రం. ఆ తర్వాత ఆయన పూర్తిగా నటజీవితాన్ని వదిలి చెన్నైలోనే సెటిల్ అయ్యారు. 

*శోభన్‌బాబుకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమాన సంఘాలు కూడా ఎక్కువే. ఆయన తన అభిమానులకు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవద్దని.. అదే డబ్బును తన కటౌట్లు కట్టడానికి వాడే బదులు ఏవైనా మంచి పనులకు ఉపయోగించమని తెలిపేవారట. అలాగే ఆయన పలు గుప్తదానాలు కూడా చేశారు. 2008, మార్చి 20 ఉదయం గం.10:50ని.లకు శోభన్ యావత్ సినీ అభిమానులను శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. 

 

 

 

Trending News