ఎన్టీఆర్‌కి సవాల్ విసిరిన రాంగోపాల్ వర్మ ?

అరవింద సమేత పోటీగా భైరవ గీత

Last Updated : Sep 5, 2018, 07:29 PM IST
ఎన్టీఆర్‌కి సవాల్ విసిరిన రాంగోపాల్ వర్మ ?

తన మాటలు, సవాళ్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈసారి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అప్‌కమింగ్ సినిమా అరవింద సమేత సినిమాకు పోటీగా తన శిష్యుడు సిద్ధార్థ డైరెక్ట్ చేసిన సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించి మరోసారి వార్తల్లోకెక్కాడు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఫ్యాక్షన్ నేపథ్యంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న అరవింద సమేత సినిమా ఈ దసరా రేసులో నిలిచిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్-ఎన్టీఆర్ లాంటి క్రేజీ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో భారీ అంచనాలున్నాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. అరవింద సమేత సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే జంటగా నటిస్తోంది. అయితే, ఇంత భారీ అంచనాలున్న ఈ సినిమాకు పోటీగా తమ సినిమాను విడుదల చేస్తున్నామని తాజాగా వర్మ ప్రకటించడం ఆసక్తిని రేకెత్తించింది.    

ఓవైపు త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్, మరోవైపు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో, స్టార్ హీరోలు అందరి సరసన నటించిన పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్, బ్లాక్ బస్టర్ కమెర్షియల్ సినిమాలు నిర్మించిన ఎస్ రాధాకృష్ణ.. ఇవన్నీ అరవింద సమేత సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్స్. అయితే, రాంగోపాల్ వర్మ ప్రకటించినట్టుగా కేవలం వర్మ శిష్యుడు అనే ట్యాగ్ తప్ప మరే ఇతర ప్రచారం లేని కొత్త దర్శకుడు సిద్ధార్ద సీనియర్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్‌కి పోటీ ఇవ్వగలడా అనేదే ప్రస్తుతం పరిశ్రమవర్గాల్లో చర్చనియాంశమైంది.

Trending News