"ప్రిన్స్" మహేష్ బాబు సినీ జర్నీ

Last Updated : Sep 28, 2017, 06:37 PM IST
"ప్రిన్స్" మహేష్ బాబు సినీ జర్నీ

 "ప్రిన్స్‌"గా తెలుగు సినీ అభిమానులు ముద్దుగా పిలుచుకొనే నటుడు మహేష్ బాబు. ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడైన మహేష్ బాబు,  ఆగష్టు 9, 1975  తేదీన చెన్నైలో జన్మించాడు. తన నాలుగవ ఏటనే ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తీసిన "నీడ" చిత్రం ద్వారా బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన మహేష్ మద్రాసులో చదువుకున్నాడు. అలా చదువుకుంటున్న సందర్భంలోనే తన తండ్రితో కలిసి అనేక చిత్రాల్లో నటించాడు. పోరాటం, శంఖారావం, బజారు రౌడీ, బాలచంద్రుడు, కొడుకు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు మొదలైనవి మహేష్, తన తండ్రితో కలిసి నటించిన కొన్ని ప్రముఖ చిత్రాలు. 

 ఆ తర్వాత కెరీర్ నుండి బ్రేక్ తీసుకొని, లయోలా కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేశాడు. మహేష్ బాబు పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించిన తొలిచిత్రం 1999లో విడుదలైన "రాజకుమారుడు". చిత్రజయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాల్లో నటించడం మహేష్ బాబు నైజం. కమర్షియల్ చిత్రాలతో పాటు అప్పుడప్పుడు సామాజిక అంశాలను కేంద్రీకరించి తీసే చిత్రాల్లో కూడా నటించడం మహేష్ బాబు ప్రత్యేకత. తేజ దర్శకత్వంలో వచ్చిన "నిజం", కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన "శ్రీమంతుడు" చిత్రాలను అందుకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. 

అలాగే మహేష్ బాబు పలు ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటించారు. కౌబాయ్ మూవీ "టక్కరిదొంగ", ఫాంటసీ మూవీ "ఖలేజా, స్టైలిష్ థ్రిల్లర్ "వన్" చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించపోయినా, మహేష్ ఆలోచనా విధానాన్ని, వైవిధ్యమైన సబ్జెక్టులు ఎంచుకోవడానికి చూపే ఆసక్తిని తెలియజేస్తాయి.  అదేవిధంగా కుటుంబ కథా చిత్రాల్లో మహేష్ నటించిన మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు ప్రేక్షకుల నాడి బాగానే పట్టుకున్నాయనడంలో సందేహం లేదు. స్పైడర్ చిత్రంతో మహేష్ బాబు తమిళనాట కూడా అడుగుపెట్టారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం మంచి మార్కులనే కైవసం చేసుకుంది. 

అవార్డులు - రివార్డులు

  • నంది పురస్కారం (ఉత్తమ నూతన నటుడు)  - రాజకుమారుడు (1999)
  • నంది పురస్కారాలు (ఉత్తమ నటుడు) - నిజం (2002), అతడు (2005), దూకుడు (2011)
  • నంది పురస్కారాలు (స్పెషల్ జ్యూరీ) - మురారి (2001), టక్కరిదొంగ (2002), అర్జున్ (2004), 
  • ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు - ఒక్కడు (2002), అతడు (2005), పోకిరి (2006), దూకుడు (2011), బిజినెస్ మాన్ (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)

Trending News