'పద్మావత్'కి తప్పని ముప్పు.. వార్నింగ్ ఇచ్చిన కర్ణిసేన!

పద్మావత్ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ పాత కష్టాలు మాత్రం ఇంకా అలాగే వెంటాడుతున్నాయి.

Last Updated : Jan 3, 2018, 11:43 AM IST
'పద్మావత్'కి తప్పని ముప్పు.. వార్నింగ్ ఇచ్చిన కర్ణిసేన!

'పద్మావత్' చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కానీ ఆ సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించిన కర్ణిసేన నుంచి మాత్రం ఇంకా అడ్డంకులు తొలగిపోలేదు. దేశ వ్యాప్తంగా పద్మావత్ సినిమా విడుదలను అడ్డుకుంటామని తాజాగా రాష్ట్రీయ్ రాజ్‌పుత్ కర్ణిసేన మరోసారి ప్రకటించింది. అహ్మాదాహాద్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు.. హిందువుల మనోభావాలు కించపర్చే రీతిలో చిత్రీకరించిన పద్మావత్ చిత్రానికి సెన్సార్ బోర్డ్ కేవలం ఐదు మార్పులతో U/A సర్టిఫికెట్ ఇవ్వడం అత్యంత దురదృష్టకరం అని అన్నారు. అందుకే ఈ సినిమాను ప్రభుత్వమే నిషేధించాలని, లేనిపక్షంలో దేశ వ్యాప్తంగా వున్న తమ సంఘం సభ్యులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి వెనుకాడబోరు అని హెచ్చరించారు. 

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకునె టైటిల్ రోల్ పోషించగా షాహీద్ కపూర్, రణ్‌వీర్ సింగ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. గత డిసెంబర్ 1వ తేదీనే విడుదల కావాల్సి వున్న ఈ సినిమా ఆందోళనల కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.

Trending News