రంగస్థలం సినిమాలో క్లైమాక్స్‌కి ముందు వచ్చే "ఓరయ్యో నా అయ్య" సెంటిమెంట్ సాంగ్ ఆ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచింది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్‌లో చంద్రబోస్ రచించి, స్వయంగా పాడిన పాట ఆడియెన్స్ గుండెలను పిండేసింది. సినిమాలోని సన్నివేశాలను, కథాంశం ఇతివృత్తం మొత్తాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన పాట ఇది. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు అన్నయ్యగా ఆది పినిశెట్టి పోషించిన కుమార్ బాబు పాత్ర మృతిచెందినప్పుడు.. రంగస్థలాన నీ పాత్ర ముగిసిందంటూ బ్యాగ్రౌండ్‌లో వచ్చే ఈ పాట ఆడియెన్స్ ని ఏడిపించినంత పనిచేసింది. రంగస్థలం మ్యూజిక్ పార్ట్‌నర్స్‌లో ఒకటైన టీ సిరీస్ తెలుగు తాజాగా ఈ పాటను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. దాదాపు ఐదున్నర నిమిషాల నిడివి వున్న ఈ లిరికల్ సాంగ్‌కి యూట్యూబ్‌లోనూ భారీ స్పందన కనిపిస్తోంది.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం థియేటర్స్‌లోనూ భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి, యాంకర్ అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఆడియెన్స్ నుంచి మంచి మార్కులు పొందడంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.