Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్

Veera Simha Reddy Movie Review మాస్ డైరెక్టర్‌గా గోపీచంద్ మలినేనికి మంచి పేరు ఉంది. అలాంటి డైరెక్టర్ బాలయ్యను ఇంకెలా చూపిస్తాడో ఊహించుకోవచ్చు. ఇప్పుడు వీర సింహా రెడ్డి అయితే అభిమానుల అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 12, 2023, 12:58 PM IST
  • నేడు థియేటర్లోకి వచ్చిన బాలయ్య
  • వీర సింహా రెడ్డిపై నెట్టింట్లో చర్చలు
  • కథ, కథనాలు ఏంటన్నది చూద్దాం
Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్

Veera Simha Reddy Movie Review నందమూరి బాలకృష్ణ, శ్రుతి హాసన్ కాంబోలో వచ్చిన వీర సింహా రెడ్డి సినిమా ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తోంది. సంక్రాంతి బరిలోకి జనవరి 12న ఈ చిత్రం దిగింది. గోపీచంద్ మలినేని టేకింగ్, బాలయ్య యాక్షన్, డైలాగ్స్ అన్నీ కూడా ఇప్పటికే టీజర్, ట్రైలర్ల ద్వారా వైరల్ అయ్యాయి. మరి ఈ సినిమా కథ, కథనాలు ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించాయో ఓ సారి చూద్దాం.

కథ
జై సింహా రెడ్డి (బాలకృష్ణ) తన అమ్మ మీనాక్షి (హనీ రోజ్)తో కలిసి ఇస్తాంబుల్‌లో నివిస్తుంటాడు. అక్కడే ఈషా (శ్రుతి హాసన్) పరిచయం అవుతుంది. అది పెళ్లి వరకు వెళ్తుంది. చిన్నప్పటి నుంచి నాన్న గురించి చెప్పకుండా పెంచి మీనాక్షి.. మొదటి సారిగా తండ్రి వీర సింహా రెడ్డి (బాలకృష్ణ) గురించి చెబుతుంది. ముప్పై ఏళ్లుగా మీనాక్షి, వీర సింహా రెడ్డిలు దూరంగా ఉంటారు. రాయలసీమలో వీర సింహా రెడ్డి, ఇస్తాంబుల్‌లో మీనాక్షి దూరంగా గడపడానికి కారణం ఏంటి? వీర సింహా రెడ్డి జీవితంలో భానుమతి (వరలక్ష్మీ శరత్ కుమార్) పాత్ర ఏంటి? వీర సింహా రెడ్డిని చంపేందుకు ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్‌) చేసే ప్రయత్నాలు ఏంటి? ఎన్ని సార్లు చంపడానికి వచ్చినా కూడా ప్రాణభిక్ష ఎందుకు పెడుతుంటాడు? చివరకు జై సింహా రెడ్డి చేసిన పని ఏంటి? అనేది కథ.

నటీనటులు
నందమూరి బాలకృష్ణ సినిమాలంటే.. అందరూ కూడా ఏం ఆశిస్తారో అవే ఈ సినిమాలోనూ చూపించారు. బాలయ్య డైలాగ్స్, డ్యాన్సులు, ఫైట్స్‌ అంటూ దుమ్ములేపేశాడు. ఎనర్జీతో కనిపించాడు. ఎమోషనల్‌ సీన్స్‌తో ఏడిపించాడు. అలా బాలయ్య వన్ మెన్ షోగానే నడిచింది. బాలయ్య తరువాత దునియా విజయ్, వరలక్ష్మీ పాత్రలు బాగానే మెప్పిస్తాయి. సిద్దప్ప పాత్ర, మీనాక్షి కారెక్టర్‌లో హనీ రోజ్ బాగానే ఆకట్టుకుంటాయి. అయితే హనీ రోజ్‌కు ఓల్డ్ గెటప్ కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. గ్లామర్ పరంగా మాత్రం హనీ రోజ్ కుర్రకారును మెప్పిస్తుంది. నవీన్ చంద్ర పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. రాజీవ్ కనకాల, సచిన్ ఖేద్కర్, జాన్ కొక్కెన్ వంటి మిగిలిన పాత్రలన్నీ కూడా పర్వాలేదనిపిస్తాయి.

విశ్లేషణ
తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది.. దక్షిణాది చిత్ర సీమ ఇప్పుడు బాలీవుడ్‌కు పయనీర్‌గా ఉంది. అయితే మన తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రం ఇంకా ఎక్కడో ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. మన జెండా ఆకాశంలో ఎగురుతూ ఉంటే.. కొందరు మాత్రం ఇంకా పాతాళంలోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. కొత్త కథలు చెప్పకపోయినా పర్లేదు గానీ.. కనీసం కథనాన్ని అయినా ఆసక్తికరంగా మార్చలేకపోతోన్నారు. కథలు కొత్తవి ఉండవు.. చెప్పిన కథల్నే మళ్లీ మళ్లీ కొత్తగా చెబుతుంటారు అని అందరికీ తెలిసిందే.

కానీ ఈ వీర సింహా రెడ్డి విషయానికి వస్తే గోపీచంద్ మలినేని కథ, కథనం విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. ఇలాంటి కథలు మనం ఇది వరకు ఎప్పుడో చూసేశాం. బాలయ్య తీసిన సమర సింహా రెడ్డి, చెన్నకేశవరెడ్డి, నరసింహా నాయుడు సినిమాలను మళ్లీ అటు తిప్పి ఇటు తిప్పి రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తే ఇంకా రాయల సీమ ఇలాంటి పరిస్థితుల్లో ఉందా? అనిపిస్తుంది. అసలు ఈ సినిమాను చూస్తే మనం 2023లోనే ఉన్నామా? అనే ఫీలింగ్ కూడా వస్తుంది.

ఎప్పటి కథలు, ఎప్పటి కథనాలు అని మన మీద మనకే జాలి కలిగేలా సినిమా నడుస్తుంటుంది. ఇక లాజిక్‌లు వెతికితే మాత్రం తలబొప్పి కడుతుంది. పక్క ఊర్లో అరాచకాలు జరుగుతున్నాయని ఓ బుడ్డోడు చెబితే గానీ వీర సింహా రెడ్డి వరకు మ్యాటర్ రాదట. ఇలాంటి సిల్లీ సీన్లు సినిమాలో ఎన్నో ఉంటాయి. ఇవన్నీ దర్శకుడు రాసుకున్న కథ, కథనంలోని లోపమే. అయితే ఇందులో అన్నా, చెల్లెలి సెంటిమెంట్ కాస్త కొత్తగా అనిపించే అవకాశం ఉంది. ఈ సినిమాకు ఏదైనా కొత్తగా ఉందని అనిపిస్తే అది ఈ ఒక్క విషయంలోనే.

ప్రథమార్థంలో శ్రుతి హాసన్ కనిపించే రెండు మూడు సీన్లు చాలా చిరాగ్గా అనిపిస్తాయి. ప్రేక్షకులు తలకొట్టేసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. వీర సింహా రెడ్డి ఎంట్రీ నుంచి ప్రథమార్థం ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ సీన్, ట్విస్ట్ బాగుంటుంది. మొదటి సారిగా ఇలాంటి ఓ ఎమోషనల్ ఇంటర్వెస్ సీన్ వేసినట్టు అనిపిస్తుంది. ఇక రెండో భాగంలో ఎమోషనల్ సీన్స్ ఎక్కువయ్యాయి. సినిమా అంతా కూడా ఊహకందేలానే సాగుతుంది. ఓ పాట, ఓ ఫైట్, ఓ సీన్ అన్న చందగా సాగుతుంటుంది. ఓ సగటు తెలుగు మాస్ సినిమాకు ఉండాల్సిన లెక్కలన్నీ కరెక్ట్‌గా ఫాలో అయ్యాడు గోపీచంద్. కానీ ఇది చాలా అవుట్ డేటెడ్ అని మాత్రం తెలుసుకోలేకపోయాడు.

బాలయ్య అంటే చాలు తమన్‌కు పూనకాలు వస్తాయో ఏమో గానీ ఈ సారి కూడా ఆర్ఆర్‌తో దుమ్ములేపేశాడు. పాటలు ఓకే అనిపించగా.. కొన్ని మాటలు మాత్రం బాగున్నాయి. ప్రభుత్వం మీద వేసిన సెటైర్ల ప్రభావం సినిమా మీద పడేలా ఉంది. కెమెరాపనితనం బాగుంది. ఎడిటింగ్‌లో చాలా సీన్లే లేపేయాల్సిందనిపిస్తుంది. మైత్రీ కాబట్టి.. నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదనిపిస్తుంది.

రేటింగ్ : 2.5

బాటమ్ లైన్ : గోపీచంద్ మలినేని రాసిన డైలాగ్ మాదిరే.. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ కాదు.. గాడ్స్ ఆర్డర్ లా.. జీవో అంటే.. గోపీచంద్ మలినేని అవుట్ డేటెడ్ మూవీ

Also Read: Chiranjeevi: మెగాస్టార్ చిరుపై విష ప్రయోగం, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది..వైరల్ అవుతున్న వార్త

Also Read: Veera Simha Reddy Twitter Review : వీర సింహా రెడ్డి ట్విట్టర్ స్టోరీ.. బోయపాటి కన్నా అరాచకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News