Mahesh Attends 11th day ritual of Ramesh Babu : సోదరుడు రమేష్ బాబు పెద్దకర్మకు హాజరయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు. హైదరాబాద్‌లోని రమేష్ బాబు నివాసంలో జరిగిన 11వ రోజు కర్మకాండ కార్యక్రమంలో మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ బాబు చిత్ర పటాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురైన మహేష్ బాబు కన్నీటిపర్యంతమైనట్లు తెలుస్తోంది. అన్నయ్యతో జ్ఞాపకాలను తలచుకుంటూ ఆయన బాధపడినట్లు తెలుస్తోంది. రమేష్ బాబు పెద్దకర్మకు మహేష్ (Mahesh Babu) హాజరైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కుటుంబ సభ్యులు, బంధువులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే పెద్దకర్మకు హాజరైనట్లు సమాచారం. కరోనా కారణంగా సోదరుడు రమేష్ బాబు (Ramesh Babu) అంత్యక్రియలకు మహేష్ బాబు హాజరుకాలేకపోయిన సంగతి తెలిసిందే. సోదరుడి కడసారి చూపుకు నోచుకోకపోవడం మహేష్‌ను తీవ్రంగా కలచివేసింది. అన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ... 'ఈ జీవితమే కాదు.. మరో జన్మంటూ ఉంటే.. మీరే ఎప్పటికీ నా అన్నయ్య..' అంటూ ఆ సమయంలో మహేష్ బాబు భావోద్వేగపూరితంగా స్పందించారు. ఇటీవలే మహేష్ కరోనా నుంచి కోలుకోవడంతో రమేష్ బాబు పెద్దకర్మకు హాజరయ్యారు.
రమేష్ బాబు అనారోగ్యంతో ఈ నెల 8న కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్ బాబు తీవ్ర అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేష్ బాబు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రమేష్ బాబు మరణం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రమేష్ బాబుకు నివాళులు అర్పించారు. ఆ మరుసటి రోజు ఫిలిం నగర్ మహాప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు జరిగాయి.
హీరోగా దాదాపు 15 చిత్రాల్లో నటించిన రమేష్ బాబు (Ramesh Babu).. చివరిసారిగా 1997లో వచ్చిన 'ఎన్‌కౌంటర్' సినిమాలో వెండి తెరపై కనిపించారు. ఆ తర్వాతి కాలంలో నిర్మాతగా మారి పలు చిత్రాలు నిర్మించారు. వీటిలో మహేష్ బాబు హీరోగా నిర్మించిన అర్జున్, అతిథి, హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నిర్మించిన 'సూర్యవంశం' చిత్రాలు ఉన్నాయి. రమేష్ బాబు అకాల మరణం ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
Also Read: Video: Video: ఈ బీహార్ బాలుడు చెప్పింది వింటే.. నవ్వి నవ్వి పొట్ట చెక్కలవ్వాల్సిందే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook