ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు గతకొంత కాలంగా కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఓ టీవీషోలో నటుడు ఆలీతో జరిగిన సంభాషణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, గుండు హనుమంతరావుకి 2 లక్షల రూపాయలు ధన సహాయం చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఓ అడుగు ముందుకు వేసి ఈ హాస్యనటుడికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం విశేషం.
హనుమంతరావు చికిత్స నిమిత్తం 5 లక్షల రూపాయల నగదును ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదల చేస్తున్నట్లు తెలంగాణ పురపాలక శాఖమంత్రి కె తారకరామారావు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం హనుమంతరావు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తన ఆర్థిక స్థోమత సరిపోకపోవడంతో ఆయన ఆ విషయాన్ని ఇటీవలే తన సన్నిహితుల వద్ద పంచుకున్నారు. మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కూడా హనుమంతరావు ఆర్థిక పరిస్థితిని సమీక్షించి, తనకు సహాయం విషయంలో భరోసా ఇచ్చింది.
గుండు హనుమంతరావు 3 సార్లు ఉత్తమ హాస్యనటుడిగా ఆంధ్రప్రభుత్వం నుండి నంది అవార్డులు గెలుచుకున్నారు. జంధ్యాల దర్శకత్వం వహించిన 'అహనా పెళ్లంట' చిత్రంతో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయనకు మాయలోడు, యమలీల, రాజేంద్రుడు గజేంద్రుడు, పేకాట పాపారావు లాంటి చిత్రాలు ఎంతో పేరు తీసుకువచ్చాయి. గంగరాజు గుణ్ణం తెరకెక్కించిన 'అమృతం' సీరియల్‌లోని ఆంజనేయులు పాత్ర ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య కారణాల వల్ల ఆయన నటనకు దూరంగా ఉంటున్నారు.
Rs. 5 lakhs for treatment of popular cube artist Gundu Hanmanth Rao released from CM relief fund. pic.twitter.com/n7aGw2zfjO
— KTR (@KTRTRS) January 8, 2018