ఈ ఏడాది సమ్మర్ సీజన్‌లో రిలీజ్ కానున్న భారీ చిత్రాల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అప్‌కమింగ్ సినిమా భరత్ అను నేను, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా నా పేరు సూర్య వున్నాయి. వాస్తవానికి ముందస్తుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ రెండు సినిమాలు ఏప్రిల్ 27న ఒకేరోజు రిలీజై బాక్సాఫీస్ వద్ద పోటీపడే పరిస్థితి తలెత్తింది. అయితే, తాజాగా రెండు సినిమాల విడుదల తేదీలలో మార్పులు చోటుచేసుకోవడంతో ఆ రెండు సినిమాల మధ్య క్లాష్ అయ్యే దుస్థితి తప్పింది. మారిన షెడ్యూల్స్ ప్రకారం కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న భరత్ అను నేను సినిమా ఏప్రిల్ 27 కన్నా ఓ వారం రోజులు ముందుగానే.. అంటే ఏప్రిల్ 20వ తేదీనే అభిమానుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.
ఇక ప్రముఖ కథా రచయిత వక్కంతం వంశీ మొదటిసారి దర్శకుడిగా మారి తెరకెక్కిస్తోన్న నా పేరు సూర్య సినిమా ఏప్రిల్ 27 కన్నా ఓ వారం రోజులు వెనక్కు వాయిదా పడి మే 4వ తేదీన రిలీజ్ కానుందని సమాచారం. ఇలా ఈ రెండు భారీ సినిమాల మధ్య రెండు వారాల వ్యవధి వుండనుండటంతో థియేటర్ల పరంగా ఒక సినిమా ప్రభావం మరొక సినిమాపై వుండకుండా నిర్మాతలు జాగ్రత్త పడ్డారనే టాక్ వినిపిస్తోంది.
భరత్ అను నేను సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ నటి కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా నా పేరు సూర్య సినిమాలో స్టైలిష్ స్టార్ సరసన అను ఎమ్మాన్యుయెల్ జంటగా కనిపించనుంది.