TV, Fridge, Washing Machine Prices: న్యూఢిల్లీ: టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ లాంటి హోమ్ అప్లయెన్సెస్ కొనాలి అని ప్లాన్ చేసే వారికి ఇదొక బ్యాడ్ న్యూస్ లాంటిది. ద్రవ్యోల్బణం తగ్గింది కనుక ఇంట్లోకి గృహోపకరణాలు కొనేందుకు ఇదే రైట్ టైమ్ అని అనుకుంటున్నారా ? అయితే, జస్ట్ వెయిట్.. ఎందుకంటే, అసలు విషయం తెలిస్తే మీరు మీ నిర్ణయం మార్చుకునే అవకాశం ఉంది. హోమ్ అప్లయెన్స్ తయారు చేసే కంపెనీలు గత రెండు సంవత్సరాలుగా వరుసగా ధరలు పెంచుతూ వస్తున్నాయి.
ఇన్‌పుట్ కాస్ట్ పెరిగింది అనే కారణంతో ఎప్పటికప్పుడు గృహోపకరణాల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే, ఈ ధరల పెంపు ట్రెండ్ ఈ సంవత్సరం కూడా కొనసాగుతుందని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎయిర్ కండీషనర్స్, రిఫ్రిజిరేటర్స్, స్మార్ట్ టీవీలు అలాగే వాషింగ్ మెషీన్ల ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. అలాగే వచ్చే నెలలో ఇంకా పెరుగుతాయని అంచనాలు చెబుతున్నాయి.
అంతేకాకుండా, రుతుపవనాల రాకలో అనిశ్చితి కారణంగా 2024 ఆర్థిక సంవత్సరం చివరి సగంలోనూ ధరలు మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది తాజాగా మీడియాకో మాట్లాడుతూ, 2020 చివర్లో ద్రవ్యోల్బణం ప్రారంభం అయిన తరువాత ఎయిర్ కండిషనర్స్ లాంటి కన్సూమర్ అప్లయెన్సెస్ గూడ్స్ ధరలు 30% పెరిగాయి అని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా.. మరో 3 నెలలకు మించి అంచనాలు వేయడం కష్టమే అని కమల్ నంది అభిప్రాయపడ్డారు.
మరోవైపు సూపర్ ప్లాస్ట్రోనిక్స్ సీఈఓ అవనీత్ సింగ్ సైతం ఈ హోమ్ అప్లయెన్సెస్ ధరల పెంపుపై మాట్లాడుతూ.. '' గత 4 నెలల్లో ఎల్‌ఈడీ ప్యానెళ్ల ధరల్లో 30 నుంచి 35 శాతం వరకు పెరుగుదల కనిపించిందని, ఈ ధరల పెంపు ఫలితంగానే జూన్‌లో టీవీ ధరలు 7 నుంచి 10 శాతం వరకు పెంచాలి అనే ఆలోచనలో ఉన్నాం" అని చెప్పుకొచ్చారు. ఒకరకంగా అవనీత్ చెప్పిన మాటలు హెచ్చరికలుగానే భావించాల్సి ఉంటుంది.
ఈ హోమ్ అప్లయెన్సెస్ ధరల పెంపు వార్తల్లో ఉపశమనం ఇచ్చేది ఏదైనా ఉందా అంటే.. ఏసీల విక్రయాల్లో లీడింగ్ కంపెనీ అయిన బ్లూ స్టార్ కంపెనీ తాము ధరలు పెంచబోం అని ప్రకటించింది. ఒకవేళ మిగితా ఏసీ కంపెనీలు కూడా అదే బాటలో ప్రయాణిస్తే.. మండు వేసవి నుంచి ఊరటనిచ్చే ఏసీల ధరల పెంపు నుంచి కొంత ఉపశమనం లభించినట్టే.