YS Sharmila Joins in Congress: వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రస్థానం ముగిసింది. ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ కండువా వేసి షర్మిలను పార్టీలోకి ఆహ్వానించారు. తరువాత రాహుల్ గాంధీ కూడా కాంగ్రెస్ కండువా కప్పారు. బుధవారం విజయవాడలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని తన కుమారుడి వివాహానికి ఆహ్వానించిన షర్మిల.. అనంతరం నేరుగా ఢిల్లీకి పయనమయ్యారు. గురువారం ఉదయం తన భర్త బ్రదర్ అనిల్‌తో కలిసి AICC ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో వైఎస్ షర్మిల హస్తం గూటికి చేరిపోయారు. ఆమె చేరికతో వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లయింది.
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. నేడు వైఎస్ఆర్టీపీను కాంగ్రెస్‌లో విలీనం చేశానని చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేత అని.. ఆయన ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించారని గుర్తు చేశారు. పార్టీ ఆదేశిస్తే అండమాన్‌లో అయినా పోటీ చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అని.. అన్ని వర్గాలను కలుపుకుంటూ.. అందరినీ కలుపుతూ పని చేస్తుందన్నారు. ఒక క్రిస్టియన్‌గా మణిపూర్‌లో చర్చిల కూల్చివేత తనను తీవ్రంగా బాధించిందని చెప్పారు.
సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుందని అనడానికి ఇదొక నిదర్శనమన్నారు షర్మిల. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీపై నమ్మకాన్ని తనతో పాటు ప్రజలందరిలో పెంచిందని చెప్పారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌కి మద్దతు ప్రకటించి పోటీ చేయలేదన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి ఆశయమన్నారు. కాగా.. వైఎస్ షర్మిలకు ఏ పదవి అప్పగిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. లేదా ఏఐసీసీలో పదవి ఇస్తారా..? అని తేలాల్సి ఉంది.
Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter