ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం దేశ రాజధాని ఢిల్లీలో నిరవధిక దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటే రాష్ట్రంలోని రాజకీయ పక్షాలన్నీ ఏకమవ్వాల్సిందేనని భావించిన టీడీపీ ఇవాళ రాష్ట్రంలోని అఖిలపక్షాన్ని సమావేశానికి పిలిచిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సిన తీరు, విధివిధానాలపై అఖిలపక్షంతో చర్చించి ఇకపై తమ కార్యాచరణ ఎలా వుండాలనే అంశంపై ఓ నిర్ణయానికి రావాలనేది ఈ సమావేశం వెనుకున్న నిర్ణయంగా తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఇదిలావుంటే, ఈ అఖిలపక్షం సమావేశంతో ప్రయోజనం శూన్యం అని భావించిన జనసేన పార్టీ ఈ సమావేశానికి దూరంగా వుండగా.. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ సైతం ఈ సమావేశానికి దూరంగా వుండటమే కాకుండా అందుకు గల కారణాలను వెల్లడిస్తూ ఓ లేఖ రాసింది.
ఈ అఖిలపక్షం భేటీతో నిజంగానే ప్రయోజనం ఎంత వరకు వుంటుందనే సంగతిని పక్కనపెడితే, ఈ సమావేశం నేపథ్యంలో ఏపీ సెక్రటేరియట్ వద్ద వినిపించిన టాక్ మాత్రం కొంత ఆసక్తిని రేకెత్తించింది. ఆ టాక్ ఇంకేంటో కాదు.. ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో నిరవధిక దీక్ష చేపట్టాలని భావిస్తున్నారట అనేదే ఆ టాక్ సారాంశం. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు ప్రత్యేక హోదా కోసం పోరాడుతామని ప్రకటించిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. ఒకవేళ సమావేశాలు ముగిసేలోగా కేంద్రం నుంచి స్పందన రాకపోయినట్టయితే, సమావేశాలు నిరవధిక వాయిదా పడిన మరుక్షణమే తమ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని నిన్ననే ప్రకటించిన సంగతి తెలిసిందే.
వైఎస్సార్సీపీ రాజీనామాల విషయంలో చేసిన కీలక ప్రకటన ఆ పార్టీని ఒక అడుగు ముందుండెలా చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీడీపీ ఇప్పుడిలా అఖిలపక్ష భేటీకి పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులోనూ చంద్రబాబు ఢిల్లీలో నిరవధిక దీక్ష చేపడతారనే టాక్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనిపై చంద్రబాబు నిర్ణయం ఏంటనేది ఆయన స్వయంగా స్పందిస్తే తప్ప తెలిసే అవకాశం లేదు.