Andhra Pradesh Floods: భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితం కాగా.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం ఏర్పడింది. రాజధానికి సమీపాన ఉన్న ప్రధాన నగరం విజయవాడ వరదలతో కొట్టుకుపోయే పరిస్థితి చేరింది. కృష్ణమ్మ శాంతించడంతో పెద్ద గండమే తప్పింది. జలదిగ్బంధంలో మునిగిన బెజవాడవాసులను కాపాడేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. కేంద్ర, రాష్ట్ర అధికారులతోపాటు స్వచ్ఛంద సంస్థలు, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సహాయ చర్యల్లో మునిగాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంతో కలిసి అహోరాత్రులు కష్టపడుతూ సహాయ చర్యల్లో మునిగారు. మాజీ సీఎం జగన్, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తమ తోచినంత సహాయం చేస్తూ ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ మాత్రం పత్తా లేడు.
Also Read: Vijayawada Floods: ఆపత్కాలంలో అండగా.. ఆంధ్రప్రదేశ్‌కు భారీ విరాళాలు
అదృశ్యం..?
కొన్ని రోజులుగా వరుణుడు ఆంధ్రప్రదేశ్‌ను వణికిస్తున్నా.. విజయవాడ మునిగిపోతున్నా ఉప ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీ ప్రజలకు అండగా నిలవాల్సి ఉండగా ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. అసలు పార్టీ అధినేత రెండు రోజులుగా అదృశ్యమయ్యారు. విజయవాడ ప్రజలు వరదలతో అల్లాడుతుంటే బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న పవన్ కల్యాణ్ కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: Vijayawada Floods: శాంతించిన కృష్ణమ్మ.. వరద తగ్గుముఖంతో ఊపిరి పీల్చుకున్న విజయవాడ
అందరూ సేవా కార్యక్రమాల్లో..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తా అంటూ ఆవేశంలో ఊగిపోయిన పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చాక ఏం చేస్తున్నారని ప్రజల్లో ప్రశ్నలు మొదలవుతున్నాయి. భారీ వర్షాలతో ఏపీ వణుకుతుంటే దగ్గరుండి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా పత్తా లేకుండాపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆపత్కాలంలో డిప్యూటీ సీఎంగా కాకున్నా అయినా ఒక రాజకీయ నాయకుడిగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉండి కూడా సహాయం చేయలేని పవన్ కల్యాణ్‌పై ప్రజలు మండిపడుతున్నారు. స్వయంగా పాల్గొనకపోయినా వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉంటే కనీసం తన అధికారులతో ఫోన్‌లలో మాట్లాడి సహాయ చర్యలకు ఆదేశించవచ్చు. అలా కాకున్నా వ్యక్తిగతంగా తన సోషల్ మీడియా ద్వారానే తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వవచ్చు. కానీ అవేవీ చేయలేదు. డిప్యూటీ సీఎం అధికారిక సామాజిక ఖాతాలు, వ్యక్తిగత సోషల్ అకౌంట్ల వేదిక ద్వారా కనీసం పవన్ కల్యాణ్ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. 20 మందికి పైగా మృతి చెందారు.. రాష్ట్రం కొన్ని వేల కోట్లలో నష్టపోయినా పట్టింపు లేని ఉప ముఖ్యమంత్రిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంబరాల్లో బిజీ?
వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమవుతున్నా డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా పవన్ కల్యాణ్ కనిపించకపోవడంపై సందేహాలు వస్తున్నాయి. అసలు ఎక్కడ ఉన్నారు? అనే ప్రశ్న రేకెత్తుతోంది. వాస్తవంగా సెప్టెంబర్ 2వ తేదీ ఆయన జన్మదినం. బర్త్ డే కారణంగా కేవలం కుటుంబానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. భార్యాపిల్లలతో కలిసి తెలంగాణలో లేదా విదేశాల్లో ఏకాంతంగా గడిపినట్లు వినిపిస్తోంది. హైదరాబాద్‌లో కుటుంబసభ్యులతో జన్మదిన వేడుకలు చేసుకున్నారని మరికొందరు చెబుతున్నారు. అవి కాకుంటే బర్త్ డే సందర్భంగా తన సినిమాలకు సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొన్నారని.. ముందస్తు నిర్ణయంతో అక్కడకు వెళ్లి ఉంటారని పవన్ అభిమానులు వివరణ ఇస్తున్నారు. ఏది ఏమున్నా రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఉంటే అన్నింటిని రద్దు చేసుకుని ఉండాల్సిన బాధ్యత ఉంది.
అభిమానులు కూడా..
ఇవన్నీ పక్కనపెడితే ఏపీలో పరిస్థితులు బాగా లేకున్నా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరగడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే అభిమానులను, జనసేన నాయకులను వేడుకలు చేయొద్దని ఒక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. వేడుకలు కాకుండా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పాల్సి ఉంది. అది కూడా చేయకపోవడం.. ఏపీ ప్రజలను డిప్యూటీ సీఎం గాలికొదిలేశాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఎప్పుడు పవన్ కల్యాణ్ వరద బాధితులకు అండగా నిలుస్తారో తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter