ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలి సారిగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా ప్రారంభమయ్యాయి. రెండో రోజు సభలో అధికార, ప్రతిపక్ష నేతల వద్ద మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపుల అంశంపై సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు పరస్పరం విమర్శలు చేసుకోవడంతో సభలో యుధ్ధవాతావరణం తలపించింది
ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసిన సీఎం జగన్
సీఎం హోదాలో సభలో అడుపెట్టిన వైఎస్ జగన్ ..టీడీపీ హయంలో పార్టీ ఫిరాయింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు తీరుపై విమర్శలు సంధించారు. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు తమ పార్టీకి నెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని మండిపడ్డ జగన్...ఇదిచాలదన్నట్లు వారిలో నలుగురిని మంత్రులను చేశారని ఘాటుగా విమర్శించారు. అదే సమయంలో ముగ్గురు వైసీపీ ఎంపీలను ప్రలోభాలు పెట్టి తీసుకున్న విషయం గుర్తు చేస్తూ ..ఇలాంటి చర్యల గమనించిన ప్రజలు టీడీపీకి ప్రజలు గూబ గుయ్యి అనేట్టు కొట్టారని ఎద్దేవ చేశారు. అన్యాయం చేయబట్టే టీడీపీకి ఈ పరిస్థితి వచ్చిందని....ఈ ఎన్నికల్లో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు, అదే ముగ్గురు ఎంపీలు గెలిచారు. అది కూడా 23వ తేదీనే తీర్పు ఇచ్చారు అంటూ ఎద్దేవ చేశారు. అయితే తాను కూడా చంద్రబాబు మాదిరిగా ఆలోచించి ఉంటే ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా దక్కేది కాదు. చంద్రబాబు తరహా రాజకీయాలకు తాము పాల్పడబోమని జగన్ స్పష్టం చేశారు. ఫిరాయింపుల సంప్రదాయానికి స్వస్తి పలకాల్సి ఉందని జగన్ హితబోధ పలికారు.
ఘాటుగా బదులిచ్చిన చంద్రబాబు
సీఎం జగన్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఘుటుగా స్పందించారు. సీఎంగా జగన్ తన తొలి ప్రసంగంలోనే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ ఇలా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు.. సీఎం హోదాలో ఇలా మాట్లాడటం మంచి పద్ధతి హితవు పలికారు. సీఎం వ్యాఖ్యలు ప్రతిపక్షాన్ని కించపరిచేలా ఉందన్నారు. ఫిరాయింపుల గురించి నీతి వ్యాఖ్యలు చేస్తున్న జగన్ చరిత్రను తెలుకొని మాట్లాడాలన్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు పార్టీ మారలేదా ? గెలిచిన నాలుగు రోజుల్లోనే పార్టీ మారారు... తండ్రికి వారసులుగా చెప్పుకుంటున్న వైఎస్ జగన్... ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి... మీరు చెబుతున్న దాని ప్రకారం చూస్తే మీ తండ్రి చేసింది తప్పని ఒప్పుకోవాలని చంద్రబాబు ఎదురు దాడి చేశారు.
సభలో రగడ..
చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు అడ్డుతగలడం.. ప్రతి చర్యలో భాగంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంతో సభలో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా సభ ప్రారంభం కాగానే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపే అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇరు పక్షాల మధ్య వ్యక్తిగత దూషణలు తారా స్థాయికి చేరాయి.