ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని.. అయితే ప్రత్యేకహోదాకు ఏ మాత్రం తీసిపోనివిధంగా ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేశారు. ప్యాకేజీ వల్ల లభించే అదనపు వనరులను ఏ రూపంలో తీసుకోవాలో ఆ రాష్ట్ర సర్కార్ నిర్ణయించుకోలేకపోవడమే జాప్యానికి కారణమని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి.. ఆ తరువాత ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలిగాక తొలిసారి పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన పైవిధంగా స్పందించారు.
'ప్రత్యేక ప్యాకేజీకి 2016 సెప్టెంబరులో అంగీకారం కుదిరింది. ఈ ఏడాది జనవరిలో నిధులను అందుకొనే మార్గంలో మార్పులను రాష్ట్ర సర్కార్ సూచించగా కేంద్రం దానికీ అంగీకరించింది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఆ ఊసేలేదు' అని ఆర్థిక మంత్రి తెలిపారు.
'14వ ఆర్థిక సంఘం సిఫార్సుల అమలు తరువాత ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యం కాదు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను పెంచాం. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రం.. కేంద్ర పథకాలకు 10శాతం నిధులను, మిగిలిన రాష్టాలు 40 శాతం నిధులను వెచ్చించాలి. దానికి సమానమైన నిధులను ప్రత్యేక ప్యాకేజీ కింద 5 ఏళ్ల పాటు ఏపీకి ఇస్తామని చెప్పాం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ముందు తాము చేపట్టిన పథకాలకు 90 శాతం కేంద్ర నిధులు ఇవ్వండి, మేము 10 శాతం భరిస్తాం అన్నారు. ఈ ప్రతిపాదనకూ మేము అంగీకరించాం" అన్నారు.
'అయితే, టీడీపీ ఈ ఏడాది జనవరిలో తన వైఖరిని మార్చుకుంది. నాబార్డు ద్వారా నిధులు పొందేందుకు ఒక ప్రత్యేక ప్రయోజన వాహకంను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుందని, కేంద్రం 90శాతం భరిస్తుందని ఏపీకి చెప్పాం. ఫిబ్రవరి 7న ఏపీ అధికారులు మరికొన్ని వివరాలతో వస్తామని చెప్పి వెళ్లారు. ఇంతవరకూ వాళ్లు మమ్మల్ని సంప్రదించింది లేదు. వారి రాకకై వేచి చూస్తున్నాం' అని జైట్లీ అన్నారు.
రెవిన్యూ లోటుపై
2013-14 ఆర్థిక సంవత్సరం ఏపీ రెవిన్యూ లోటును లెక్కిస్తే.. కేంద్రం ఏపీకి ఇవ్వాల్సింది రూ.138 కోట్లే. 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం బకాయి పడ్డది రూ.1600 కోట్లని.. ఏపీకి నిధులు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వ జాప్యం ఏమాత్రం లేదని జైట్లీ వివరించారు.
ఏపీకి ప్రత్యేక హోదా అవసరమా? లేదా ప్రత్యేక ప్యాకేజీ అవసరమా? అన్న విషయంలో ప్రజా అభిప్రాయాన్ని కోరుతూ, జీ న్యూస్ ప్రారంభించిన పోల్‌లో మీరు కూడా పాల్గొని మీ అభిప్రాయాలను పంచుకోండి
ఏపీ కోర్టులోకి బంతిని నెట్టేసిన కేంద్రం