Ganta Narahari Prifile: రాజంపేటలో రసవత్తరంగా నడుస్తున్న రాజకీయం

Ganta Narahari Prifile: ఆ పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచీ ఈ లోక్ సభ స్థానంలో రెండే సార్లు గెలిచింది. మ‌రో రెండు సార్లు పొత్తులో బాగంగా పోటీ నుంచి త‌ప్పుకుంది. ప‌దేళ్లుగా ఆ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీగా టిడిపి నుండి ఎవ‌రూ పోటీలో లేరు... ఇప్పుడు ఆ పార్టీ తమ పార్టీ తరపున కొత్త అభ్య‌ర్థిని తీసుకొచ్చింది. ఇంతకీ ఎవరా అభ్యర్థి, ఏమా కథ ?

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2023, 04:24 AM IST
Ganta Narahari Prifile: రాజంపేటలో రసవత్తరంగా నడుస్తున్న రాజకీయం

Ganta Narahari Prifile: ఆ పార్టీ పుట్టిన‌ప్ప‌టి నుంచీ ఈ లోక్ సభ స్థానంలో రెండే సార్లు గెలిచింది. మ‌రో రెండు సార్లు పొత్తులో బాగంగా పోటీ నుంచి త‌ప్పుకుంది. ప‌దేళ్లుగా ఆ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీగా టిడిపి నుండి ఎవ‌రూ పోటీలో లేరు... ఇప్పుడు ఆ పార్టీ తమ పార్టీ తరపున కొత్త అభ్య‌ర్థిని తీసుకొచ్చింది... వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్లమెంట్ స్థానం నుంచి స‌త్తా చాటాల‌ని శ‌త‌విధాల ప్ర‌య‌త్నిస్తోంది... చిత్తూరు, ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాల్లో ఇప్పుడు ఆ పార్టీకి ఈ ఎంపీ సీటు కీల‌క‌మే.. మ‌రి ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయా... ఇక్క‌డ పాగా వేయ‌డం ఆపార్టీకి సాధ్య‌మ‌వుతుందా ? ఆ పార్లమెంట్ లో టిడిపి పాగా వేస్తుందా? తెలుసుకోవాలంటే ఈ ఫుల్ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.

ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని రాజంపేట పార్ల‌మెంట్ స్థానం.. ఒక‌ప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి.. ఇప్పుడు వైసిపికి కంచుకోట‌.. 1984, 1999 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మాత్రం టిడిపి గెలిచింది.. ఇక అప్ప‌టి నుంచి ఇక్క‌డ టిడిపి గెలిచింది లేదు. 1984 లో సుగ‌వాసి పాల‌కొండ రాయుడు, 1999లో గునిపాటి రామ‌య్య‌లు ఇక్క‌డ టిడిపి నుంచి పార్ల‌మెంటుకి ప్రాతినిధ్యం వ‌హించారు. 2014 ఎన్నిక‌ల్లో ఈ స్థానం టిడిపి - బిజెపి పొత్తులో భాగంగా బిజెపీ అభ్య‌ర్థి  పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. 2014 లో ఎన్టీఆర్ కుమార్తె ద‌గ్గుపాటి పురంధేశ్వ‌రి బిజేపి తర‌ఫున రాజంపేట నుంచి పోటీ చేసి ఓట‌మిని చ‌విచూశారు. మాజీ ముఖ్య‌మంత్రి కుమార్తె పోటీ చేసినా ఇక్క‌డి జ‌నం పెద్ద‌గా ఆద‌రించ‌లేదు. ఆనాడు వైసిపి, కాంగ్రెస్‌, జ‌న‌సేన‌, బిజెపిల మ‌ధ్య పోటీలో వైసిపి అభ్య‌ర్ధి మిథున్‌రెడ్డి తొలిసారి ఎంపీ అయ్యారు. అప్ప‌టి వ‌ర‌కు వ‌రుస‌గా గెలుస్తూ వ‌చ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత స‌న్నిహితుడైన ఏ. సాయిప్రతాప్ ఓట‌మి పాల‌య్యారు. ఆపై ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉండిపోయారు. 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో టిడిపి త‌ర‌పున డి.ఏ. స‌త్య ప్ర‌భ పోటీ చేసి వైసిపి అభ్య‌ర్థి మిధున్ రెడ్డి చేతిలో ఓట‌మి పాల‌య్యారు. 

1999లో టిడిపి త‌ర‌ఫున గెలుపొందిన గునిపాటి రామ‌య్య‌, 2004లో సాయిప్ర‌తాప్ చేతిలో ఓడిపోయారు. 2009లో టిడిపి, కాంగ్రెస్‌, ప్ర‌జా రాజ్యం మధ్య పోటీలో మ‌ళ్ళీ కాంగ్రెస్ త‌ర‌ఫున సాయిప్ర‌తాప్ గెలిచారు. బిసీల జ‌నాభా, ఓట‌ర్లు అధికంగా ఉన్న ఈ పార్ల‌మెంటులో టిడిపి ప‌ట్టుకోసం చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేదు. గ‌డ‌చిన రెండు ఎన్నిక‌ల్లో పొత్తులో భాగంగా బిజెపికి సీటు ఇచ్చి టిడిపి సైడ్ అయింది. దీంతో టిడిపి ఓటు బ్యాంకు ఉన్నా ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌టంతో టిడిపికి కొంత మైన‌స్ అయ్యింది. ఇప్పుడు ఆలోటును పూడ్చేందుకు టిడిపి ముందుగానే రంగంలోకి దిగింది. 2019 ఎన్నిక‌ల త‌ర‌వాత రాష్ట్రంలోనూ మరీ ముఖ్యంగా చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గంలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో టిడిపి అధిష్టానానికి, మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రారెడ్డికి మ‌ధ్య రాజ‌కీయంగా ఇద్ద‌రి మ‌ధ్య వైరం ప‌తాక స్థాయిలో ఉంది. చిత్తూరు జిల్లాలో టిడిపిని లేకుండా చేస్తామంటూ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రాజ‌కీయాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రాజంపేట పార్ల‌మెంటు స్థానంపై కూడా ప్ర‌త్యేక దృష్టి పెట్టింది ప‌సుపు పార్టీ. 

గ‌త ఏడాది జులై నెల‌లో మ‌ద‌న‌ప‌ల్లిలొ జ‌రిగిన టిడిపి జోన్‌-5 స‌మావేశంలో క‌డ‌ప‌, రాజంపేట పార్ల‌మెంటు టిడిపి అభ్యర్థుల‌ను ప్ర‌క‌టించింది పార్టీ అధిష్టానం. క‌డ‌ప పార్ల‌మెంటు అభ్య‌ర్థిగా పొలిట్ బ్యూరో స‌భ్యులు రెడ్డ‌ప్పగారి శ్రీ‌నివాసుల‌ రెడ్డి, రాజంపేట పార్ట‌మెంటు అభ్య‌ర్ధిగా గంటా న‌ర‌హ‌రిని ప్ర‌క‌టించింది. క‌డ‌ప పార్ల‌మెంటుకు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థి గ‌తంలో పోటీ చేసిన అభ్య‌ర్థి కావ‌డం, జిల్లా అధ్య‌క్ష ప‌ద‌వితో పాటు, పొలిట్ బ్యూరోలో స్థానం ఉండ‌టంతో పెద్ద ఇబ్బంది ఏమీలేదు... కానీ పెద్దిరెడ్డి ప్యామిలీతో త‌ల‌పడేందుకు ఆర్థికంగా, సామాజిక వ‌ర్గం ప‌రంగా బ‌లంగా ఉన్న నాయ‌కున్నే ఈసారి టిడిపి బ‌రిలోకి దింపేందుకు క‌స‌రత్తు చేసింద‌నే చెప్పాలి...

రాజంపేట పార్ల‌మెంటు అభ్య‌ర్ధిగా టిడిపి ఎంపిక చేసిన అభ్య‌ర్థి గంటా న‌ర‌హ‌రి... యువ పారిశ్రామిక వేత్త‌... బెంగ‌ళూరు కేంద్రంగా వ్యాపారాలు నిర్వ‌హిస్తూ, రాణిస్తున్నారు. యువ పారిశ్రామిక వేత్త‌గా రాష్ట్ర ప‌తి నుంచి అవార్డు కూడా అందుకున్న గంటా న‌ర‌హ‌రి.. రాజ‌కీయాల్లోకి కొత్త‌గా రంగ‌ప్ర‌వేశం చేశారు. కుటుంబ రాజ‌కీయ బ్యాక్‌గ్రౌండ్‌తో తాను రాజ‌కీయాల్లో ఆస‌క్తి పెంచుకున్నారు. వ్యాపారాల్లో స‌క్సెస్ అయిన గంటా న‌ర‌హ‌రి వైసిపి అభ్య‌ర్థి మిధున్ రెడ్డిపై పోటీకి సిద్ధ‌మ‌య్యారు. గంటా న‌ర‌హ‌రి, డికే ఆదికేశ‌వుల‌ు నాయుడుకి స‌మీప బంధువు కూడా కావ‌డంతో కొంత అనుకూల ప్ర‌భావం కూడా ఉంద‌ని పార్టీ క్యాడ‌ర్లో చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తేడాది టిడిపి ఎంపీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచీ అప్పుడ‌ప్పుడు పార్టీ కార్య‌క్ర‌మాల‌లో క‌నిపించిన గంటా న‌ర‌హ‌రి.. ఇటీవ‌ల చురుగ్గా రాజంపేట పార్ల‌మెంటు ప‌రిధిలో తిరుగుతున్నారు. ర‌హ‌స్యంగా నాయ‌కుల‌ను, కార్య‌క్త‌ల‌ను క‌లిసి గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నారు.

అన్న‌మ‌య్య జిల్లా టిడిపిలో ఉన్న వ‌ర్గ విబేధాల మధ్య గంటా న‌ర‌హ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో నెగ్గుకు రాగ‌ల‌డా అన్న అనుమాలు కూడా లేక‌పోలేదు. రాజంపేట ఎంపీ అభ్య‌ర్తిగా ప్ర‌క‌టించినప్పటికీ... కొన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోని టిడిపి నేతలు ఆయ‌న‌కు అనుకూలంగా లేర‌న్న టాక్ వినిపిస్తోంది. కోడూరు, రాజంపేట ప్రాంతాల్లో అటు క‌స్తూరి విశ్వ‌నాథ‌ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ బ‌త్యాల చంగ‌ల్‌ రాయుడుతో మంచి సంబంధాలున్నాయి. కొన్ని సంద‌ర్భాల్లో వారితో క‌లిసే పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. ఇక రాయ‌చోటి టిడిపిలో ఉన్న వ‌ర్గ విబేధాలతో గంటా నరహరికి ఇబ్బంది త‌ప్ప‌డం లేద‌ట‌... మూడు వ‌ర్గాలుగా ఉన్న నాయ‌కులు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్నట్లుగా ఉన్నార‌ట‌.

ఇది కూడా చదవండి : AP EAMCET Result 2023 Date: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల తేదీ ఎప్పుడంటే..

ఇక రాజంపేట పార్ల‌మెంట్ ప‌రిధిలోకి వ‌చ్చే మ‌ద‌న‌ప‌ల్లె టిడిపీలో కూడా రెండు వ‌ర్గాలు ఉండ‌టంతో అక్క‌డకూడా స‌యోధ్య లేద‌ట‌... వ‌చ్చే ఎన్నికల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఢీ కొట్టేందుకు రాజ‌కీయ వ్యూహాలు ప‌న్నుతున్నార‌ట‌. వ్యాపారాల‌ను కూడా ప‌క్క‌న‌పెట్టి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన గంటా న‌ర‌హ‌రికి అంద‌రు నేత‌లు స‌హ‌రిస్తేనే ఇక్క‌డ ఏదైనా ఫలితం ఉంటుంది త‌ప్ప‌... లేదంటే పార్టీలోని అంత‌ర్గ‌త విభేదాలు రాజంపేట పార్ల‌మెంట్ అభ్య‌ర్థిపై ప్ర‌భావం చూపుతాయ‌న్న ఆందోళ‌న పార్టీ వ‌ర్గాల్లో ఉంది. పార్టీలో వ‌ర్గాల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి రూట్ క్లియ‌ర్ చేస్తే ముందుకు వెళ్లేందుకు వీలుటుంద‌న్న అభిప్రాయం  పార్టీ క్యాడ‌ర్‌లో వ్య‌క్తం అవుతోంది. పార్టీలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను అధిష్టానం ఎప్పుడు స‌రిదిద్దుతుందీ, రాజంపేట పార్ల‌మెంటులో ఎప్పుడు పాగా వేస్తుందీ అన్న సంశ‌యం పార్టీలోని నేత‌ల‌ను ప‌ట్టి పీడిస్తోందట‌. మరి చంద్రబాబు నాయుడు అంతర్గత సమస్యలు పరిష్కరించి గంటా గెలుపునకు బాటలు వేస్తారా లేదా అనేది ఇంకొద్ది రోజులు ఆగితే కానీ తెలిసే ఛాన్స్ లేదు. ఇదీ రాజంపేట రాజకీయాల కహానీ..

ఇది కూడా చదవండి : Odisha Train Accident Updates: రైలు ప్రమాద బాధితులకు సీఎం జగన్ ఎక్స్‌గ్రేషియా.. ఏపీ వాసులను ఆదుకోవాలని ఆదేశం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News