అమరావతి: వైఎస్సార్సీపీ ఫిర్యాదు మేరకు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో టీడీపి సైతం మరో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాల్సిందిగా పట్టుబడుతోంది. వైఎస్సార్సీపీ కోరిన చోట రీపోలింగ్ జరిపేందుకు ఎన్నికల సంఘం అంగీకరించడంపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపి అధినేత చంద్రబాబు నాయుడు సందేహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసిన చంద్రబాబు.. తాము కోరుతున్న ప్రాంతాల్లోనూ రీపోలింగ్ నిర్వహించాల్సిందిగా డిమాండ్ చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలోని 166, 310 బూత్‌లలో రీపోలింగ్ జరపాలనే డిమాండ్‌తో టీడీపీ నేతల బృందం నేడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది.
మే 19న జరగనున్న చివరి విడత ఎన్నికల్లో భాగంగానే చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని పాకాల మండలంలో ఒకటి, రామచంద్రాపురం మండలంలో నాలుగు కేంద్రాలు చొప్పున మొత్తం ఐదు కేంద్రాల్లో రీపోలింగ్‌కి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే.