అమరావతి: చెన్నై వాసులు ఎదుర్కొంటున్న తాగు నీటి కొరత సమస్యను ఎదుర్కొనడంలో తమిళనాడు సర్కార్‌కి సహకరించాల్సిందిగా కోరుతూ ఆ రాష్ట్ర మంత్రులు, పలువురు అధికారుల బృందం శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని కలిసింది. తమిళనాడు సీఎం కె.పళనిసామి ఆదేశాల మేరకు మంత్రుల బృందం జగన్‌ని కలిసి పరిస్థితిని వివరించింది. తాగడానికి నీళ్లు లేకపోవడంతో 90 లక్షల మంది చెన్నై వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తమిళనాడు మంత్రుల బృందం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్.. వెంటనే చెన్నైకి తాగునీటి జలాలు అందివ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరభావంతో సహకరించుకోవాలని సీఎం జగన్ తమిళనాడు మంత్రుల బృందంతో అన్నారు.
తమ ఆవేదన అర్థం చేసుకుని, కోరిన వెంటనే చెన్నైకి తాగునీటి జలాలు అందించేందుకు సిద్ధపడిన సీఎం జగన్‌కి తమిళనాడు మంత్రుల బృందం కృతజ్ఞతలు తెలిపింది.