హైదరాబాద్: ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసు స్పీకర్ కోడెల శివప్రసాద్ మెడకు చుట్టుకుంది. ఈ కేసు విచారణ నిమిత్తం ఆయన స్వయంగా హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఈ కేసు విషయంలో హైకోర్టు నుంచి తెచ్చుకున్న స్టే గడువు గత నెల 27 ముగియడంతో దీనిపై నాంపల్లి స్పెషల్ కోర్టు ( ప్రజా ప్రతినిధు న్యాయస్థానం) లో విచారణ జరిగినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ కథనాల ప్రకారం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పీకర్ కోడెల స్వయం వచ్చి విచారణ ఎదుర్కొవాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఈ నెల 10న కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
గత ఎన్నికల్లో తాను కోట్లు ఖర్చు చేశానని ఓ టీవి ఇంటర్వ్యూలో స్పీకర్ కోడెల మాట్లాడిన ఫూటేజీని ఆధారంగా ఆయనపై పిటిషన్ వేశారు. ఆ ఇంటర్వ్యూలో 2014 ఎన్నికల్లో 11.5 కోట్లు ఖర్చు చేశానని స్వయంగా కోడెల చెప్పినట్లు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పూటేజీని ఆధారం చేసుకొని సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి నాంపల్లి స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్ కు కోడెల టీవి ఇంటర్యూలో మాట్లాడిన ఫూటేజీ జత చేసి కోర్టుకు అందజేశారు.
బలమైన ఆధారాలు ఉండటంతో ఈ పిటిషన్ ను ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ కోడెల హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ కేసు విషయంలో స్టే ఇచ్చింది. ఆ స్టే గడువు కూడా ముగియడంతో స్పెషల్ కోర్టులో మళ్లీ విచారణ జరిగింది. ఈ క్రమంలో కోడెల ఈ నెల 10 న కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పీకర్ కోడెల ఏ మేరకు స్పందిస్తారనే దానిపై ఉత్కంఠత నెలకొంది.