వరుడికి 13 ఏళ్లు.. వధువుకి 23 ఏళ్లు..!

అక్షరాస్యత కొరవడడం... దాంతో పాటు మూర్ఖత్వంతో తీసుకొనే నిర్ణయాలు వెరసి.. అప్పుడప్పుడు జనాలు కొన్ని విచిత్రమైన పనులు చేస్తుంటారు.

Last Updated : May 11, 2018, 04:46 PM IST
వరుడికి 13 ఏళ్లు.. వధువుకి 23 ఏళ్లు..!

అక్షరాస్యత కొరవడడం... దాంతో పాటు మూర్ఖత్వంతో తీసుకొనే నిర్ణయాలు వెరసి.. అప్పుడప్పుడు జనాలు కొన్ని విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఆ పనులు చాలా ఆశ్చర్యంతో పాటు జుగుప్సను కూడా కలిగిస్తుంటాయి. కర్నూలులో జరిగిన ఆ సంఘటన కూడా ఇలాంటిదే. ఓ కుటుంబంలో తండ్రి తాగుడికి కట్టుబానిసగా మారిపోవడంతో పాటు తల్లి కూడా అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టాడుతోంది.

అలాంటి సమయంలో తాను చనిపోతే తన 13 ఏళ్ల పిల్లాడిని ఎవరు చూసుకుంటారన్న ఆందోళన నుండి ఓ చిత్రమైన ఆలోచన ఆమెకు వచ్చింది. ఆ ఆలోచనే తన బిడ్డకు పెళ్లి చేయడం. ఈ క్రమంలో తమ దూరపు బంధువుల అమ్మాయితో తన కొడుక్కి సంబంధం కుదిర్చింది. ఇంతకీ ఆ అమ్మాయి వయసెంతో తెలుసా.. అచ్చంగా 23 ఏళ్లు. అంటే వరుడి కన్నా దాదాపు 10 సంవత్సరాలు పెద్దది. 

వధు, వరులిద్దరికీ పెళ్లి తంతు జరుగుతున్నప్పుడు ఆ వార్త దావానలంలా గ్రామమంతా వ్యాపించింది. ఆ తర్వాత ఆ పెళ్లి ఫోటోలు వాట్సాప్‌‌లో సర్క్యులేట్ అవ్వడంతో ఇప్పుడు ఈ వివాహం రాష్ట్రవ్యాప్తంగా కూడా సంచలనమైంది.

సాధారణంగా బాల్య వివాహాలు అంటే సాధారణంగా మైనారిటీ తీరని అమ్మాయిలను.. మైనారిటీ తీరిన అబ్బాయిలకు ఇచ్చి చేయడం చూస్తుంటాం. అయితే ఇక్కడ పరిస్థితి వేరు. మైనర్ అబ్బాయిని మేజర్ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయడంతో అందరూ ముక్కున వేలేసుకోవడం మొదలు పెట్టారు. అయితే ఈ పెళ్లికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదు కూడా నమోదవ్వలేదు

Trending News