సెప్టెంబర్ 15న తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట బోటును ధర్మాడి సత్యం బృందం డీప్ సీ డైవర్ల సహాయంతో ఎట్టకేలకు మంగళవారం ఒడ్డుకు చేర్చింది. 38 రోజుల తర్వాత బోటు వెలికితీయడంతో అందులో చిక్కుకున్న మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయాయి. దీంతో బోటు నీళ్లలోంచి బయటికి రావడంతోనే అక్కడి పరిసరాల్లో దుర్వాసన అలుముకుంది. బోటులో 8 మృతదేహాలు లభ్యమయ్యాయి.
పాపికొండలకు వెళ్లే క్రమంలో బోటు మునిగిపోగా ఆ సమయంలో అందులో ప్రయాణికులు, సిబ్బంది కలుపుకుని 77 మంది ఉన్నారు. వారిలో 26 మందిని స్థానిక గిరిజనులు రక్షించగా ఆ తర్వాత మొత్తం 39 మృతదేహాలను వెలికితీశారు. మిగతా 12 మంది ఆచూకీ లభించలేదు. అయితే, మంగళవారం వెలికి తీసిన బోటులో 8 మంది మృతదేహాలు లభించగా ఇప్పటికీ మరో నలుగురి ఆచూకీ లభించలేదు. వారు కూడా ప్రమాదంలో చనిపోయారా ? ఒకవేళ చనిపోతే నీటి ఉధృతికి మృతదేహాలు కొట్టుకుపోయాయా ? లేక బోటు లాగే నీటి అడుగున మృతదేహాలు చిక్కుకుపోయాయా అనేదే ఇప్పుడు ఆ నలుగురికి సంబంధించిన వారిని వెంటాడుతున్న ప్రశ్నలు.