/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

తెలంగాణ టీడీపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖ ఏపీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి పంపించారు. అలాగే  తన శాసనసభ్యత్వానికి సంబంధించిన రాజీనామా లేఖను తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు అందించారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, చంద్రబాబుకి రాసిన రాజీనామా లేఖ  వెలుగులోకి వచ్చింది. ఆ పూర్తి లేఖ ఇదే..

గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడి గారికి నమస్కారములు,

ప్రజలతో ఉండటం నా నైజం. ప్రజల కోసం పోరాడటం నా తత్వం. ప్రజాసంక్షేమం నా గమ్యం. నా స్వభావానికి తగ్గట్లుగా ప్రజా జీవితంలోకి వచ్చాను. విద్యార్థి ఉద్యమాలలో నా వంతు పాత్ర  పోషించాను.  2006లో జెడ్పీటీసీగా (ఇండిపెండెంట్) రాజకీయ ప్రస్థానం ప్రారంభించాను. 2007లో స్వతంత్ర ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాను. ప్రజల కోసం మరింత విస్తృతంగా  పనిచేయాలని నిర్ణయించుకున్నాను. దానికి  తెలుగుదేశం సరైన వేదిక అని భావించాను. రాష్ట్ర భవిష్యత్తు, ప్రజాసంక్షేమం దృష్ట్యా మీ నాయకత్వంలో పనిచేయడం సముచితమని నమ్మాను.

ఇన్నాళ్లు ప్రజల పక్షాన చేసిన పోరాటాలు నాకు గొప్ప  అనుభవాన్నిచ్చాయి. దేశంలో  ఏ నాయకుడికి లేని సుదీర్ఘ రాజకీయ, పాలన అనుభవం ఉన్న మీతో ప్రయాణం ఎప్పటికీ మరిచిపోలేనిది. మీ సారథ్యంలో అనేక ప్రజాపోరాటాల్లో భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నాను. 

ప్రతీ అడుగులో మీ మార్గనిర్దేశం, కార్యకర్తల మద్దతు నన్ను ప్రజానాయకుడిగా మలిచాయి. చంద్రబాబు నాయుడు సహచరుడిగా, తెలుగుదేశం నేతగా గుర్తింపు పొందడం నేను ఎప్పటికీ గర్వించే విషయం. టీడీపీలో చేరిననాటి నుండి ఈ క్షణం వరకు పార్టీ సిద్ధాంతాలకు, మీ నిర్ణయాలకు కంకణబద్ధుడినై పనిచేస్తూ వచ్చాను. మీరు అప్పగించిన పని త్రికరణశుద్ధిగా పూర్తి చేసే ప్రయత్నం చేశాను. తక్కువ సమయంలోనే మీరు, పార్టీ నాకు గుర్తింపు ఇచ్చారు.

మీరు భుజం తట్టి ప్రోత్సహించిన తీరు నాలో విశ్వాసాన్ని పెంచింది. సీనియర్లు అనేకమంది ఉన్నా, కీలక అవకాశాలను పార్టీ నాకు ఇచ్చింది. వాటన్నింటినీ నా శక్తి మేరకు సమర్థవంతంగా నిర్వర్తించానని నమ్ముతున్నాను. కార్యకర్తలతో నా అనుబంధం విడదీయరానిది. మీతో పాటు నేను అంతగా అభిమానించేది వాళ్లనే. లక్షలాది కార్యకర్తలు నన్ను తమ ఇంట్లో మనిషిగా అభిమానించారు. మీ  సొంతమనిషిగా గుర్తించి, నన్ను ఆరాధించారు. పోరాటాల్లో నా వెన్నంటి ఉన్నారు. కష్టనష్టాలలో అండగా నిలిచారు. తెలంగాణలో కార్యకర్తలను చూస్తుంటే గర్వంగా ఉంటుంది. పార్టీ కోసంప్రాణాలిచ్చిన వారున్నారు. ఆస్తులు కోల్పోయిన వాళ్లున్నారు. భుజాలు కాయలు కాసేలా జెండా మోసినవారున్నారు. కుటుంబం కంటే పార్టీనే ప్రాణంగా బతికినవాళ్లున్నారు.

మీరిచ్చిన ప్రోత్సాహం, వాళ్లిచ్చిన ధైర్యంతోనే  నలభై నెలలుగా కేసీఆర్ అరాచకపాలనపై పోరు సాగించాను. నాపై పాలకులు వ్యక్తిగతంగా కక్షగట్టి, అక్రమ కేసులతో వేధించిన విషయం మీకు తెలిసిందే. అరెస్టు చేసి జైల్లో పెట్టిన సందర్భంలోనూ నేను వెనుకడుగు వేయలేదు. నా బిడ్డ నిశ్చితార్థానికి కోర్టు కొన్ని గంటలు మాత్రమే అనుమతించిన సందర్భంలోనూ గుండె నిబ్బరం కోల్పోలేదు. ఈ సందర్భంలో నాకు, నా కుటుంబానికి మీరు, భువనేశ్వరి మేడమ్ గారు కుటుంబ పెద్దలుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. కష్టాల్లో ఉన్నప్పుడు మీ కుటుంబం ఇచ్చిన మద్దతు మా కుటుంబం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది.

ప్రస్తుతం తెలంగాణ సమాజం అత్యంత ప్రమాదపుటంచుల్లో ఉంది. కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయ్యింది. బంగారు తెలంగాణ ముసుగులో ప్రజాసంపద అడ్డగోలుగా దోపిడికి గురవుతుంది. ప్రజలు ఏ ఆకాంక్షలతో స్వరాష్ట్రం కోరుకున్నారో వారి ఆశలు కలలుగానే కరిగిపోతున్నాయి. అమరవీరుల ఆత్మబలిదానాలకు గుర్తింపు లేదు. ఈ పరిస్థితిని మార్చడానికి గత మూడేళ్లుగా అనేక పోరాటాలు జరిగాయి.

అయితే, తెలంగాణ సమాజం ఏకతాటిపై నిలబడి, కేసీఆర్ కుటుంబ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అనివార్యత కనిపిస్తోంది. ఈ సందర్భంలో ప్రజలెన్నుకున్న నాయకుడిగా వారి పక్షాన నిలవడమే ప్రాధాన్యమని నమ్ముతున్నాను. తెలంగాణ సమాజ హితం కోసం నేను మరింత ఉదృతంగా పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ సమాజానికి విముక్తి కల్పించడం బాధ్యతగా భావిస్తున్నాను. తెలంగాణ సమాజం కేసీఆర్‌కు వ్యతిరేకంగా బలమైన రాజకీయ పునరేకీకరణ కోరుకుంటోంది.

నా నిర్ణయాన్ని మీరు ఆ కోణంలోనే చూడండి. ఈ నేపథ్యంలో పార్టీ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పిస్తున్నాను. పార్టీ అధ్యక్షుడిగా, మార్గదర్శిగా మీరు ఇచ్చిన పోరాట పటిమ, స్ఫూర్తి గుండెల నిండా నింపుకొని  తెలంగాణ సమాజహితం కోసం మరింత విస్తృత పోరాటానికి సిద్ధమవుతున్నాను. అన్యధా భావించక... నా నిర్ణయాన్ని సహృదయతతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ..

ఇట్లు

(మీ రేవంత్ రెడ్డి)

Section: 
English Title: 
Revanth Reddy resignation letter to TDP Membership
News Source: 
Home Title: 

రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ ఇదే..!

రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ ఇదే..!
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes