Araku Valley Bus Accident: అల్లూరి జిల్లా అరకు లోయ ఆదివారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. అరకు ఘాట్ రోడ్లో పర్యాటకులతో వచ్చి వెళ్తున్న ప్రైవేటు బస్సుకు మంటలు అంటుకుని బస్సు మొత్తం తగలబడింది. అదృష్టవశాత్తుగా ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి హాని జరగలేదు. బస్సులోంచి పొగలు రావడంతోనే పసిగట్టిన పర్యాటకులు వెంటనే బస్సును పక్కకు ఆపేసి దిగిపోయారు. దీంతో అందులో ఉన్న 24 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడగలిగారు.
ఈ ప్రమాదంలో రవి రాజా ట్రావెల్స్కి చెందిన ప్రైవేటు బస్సు అందరూ చూస్తుండగానే కళ్ల ముందే కాలి బూడిదైంది. ఆదివారం రాత్రి 9:30 గంటల సమయంలో రవి రాజా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పర్యాటకులను తీసుకుని అరకు లోయ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అరకు ఘాట్ రోడ్డులోని టైడా సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కళ్ల ముందే కాలిబూడిదైన బస్సును చూసిన జనం తృటిలో ప్రమాదం తప్పిందని.. అప్రమత్తంగా లేకుంటే ఊహించని రీతిలో భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేదని ఆందోళనకు గురయ్యారు.