గతంలో హర్యానాలోని సిర్సా ప్రాంతంలో "డేరా సచ్ఛ సౌదా" పేరు ఒక సంస్థను నడుపుతూ.. కొందరు మహిళలను వ్యభిచార కూపంలోకి లాగిన గుర్మీత్ రామ్ రహీం సింగ్ ప్రస్తుతం చట్టం చేతికి చిక్కి జైలులో ఊచలు లెక్కబెడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు అచ్చం అలాంటి పనులు చేసే వ్యక్తి ఒకరు అనంతపురం కదిరిలో దొరికారు. ఒక కళాకారుడినని, అంతకు మించి ఓ గొప్ప మాంత్రికుడినని చెప్పుకు తిరిగే బాలరాజు అలియాస్ వెంకటరమణ అనే వ్యక్తి ప్రజలకు గుప్తనిధుల ఆశ చూపించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టడమే పనిగా పెట్టుకున్నాడని కదిరి పోలీసులకు సమాచారం అందింది.
అలాగే ఇదే బాలరాజు అనే వ్యక్తి తన దగ్గరకు వచ్చే మహిళలను వ్యభిచారం రొంపిలోకి కూడా దింపుతున్నాడని తెలియడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆయన ఇంటిని సోదా చేసి అరెస్టు చేశారు. అయితే పోలీసుల సోదాలో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడడంతో ఆశ్చర్యపోవడం వారి వంతైంది. బాలరాజు నివసించే ఖరీదైన ఇంటిని సోదా చేయగా.. దాదాపు 16 సీసీ టీవి కెమెరాలు బయటపడ్డాయి.
మహిళలు పూజలు చేయించుకోవడానికి తన దగ్గరకు వచ్చేటప్పుడు.. వారిని ఆ ఇంటిలో ఒక రోజు పూజ నిమిత్తం గడపాలని బాలరాజు సూచిస్తాడట. ఆ తర్వాత ఉదయానే లేచి వారు స్నానం చేయడానికి బాత్రూమ్‌లోకి వెళ్లేటప్పుడు.. ఆ దృశ్యాలను సీసీటీవి కెమెరాలలో రికార్డు చేస్తాడని దర్యాప్తులో తెలిసింది. అలాగే బాలరాజు నిద్రించే పడకగది అడుగు భాగాన ఒక నేలమాళిగ కూడా ఉన్నట్లు పోలీస్ ఎంక్వయిరీలో తేలింది.
ఒకప్పుడు తాయెత్తులు, యంత్రాలు అమ్మే ఈ బాలరాజు అనే వ్యక్తి అనతికాలంలోనే బాగా డబ్బు కొల్లగొట్టి, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడని.. ఆ తర్వాత శారదాంబ కళాకారుల సంఘం అనే పేరుతో ఒక సంస్థ స్థాపించాడని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా గుప్తనిధులను ఎలా బయటకు తీయాలన్న విషయంపై ఈయనతో చర్చించడానికి పలువురు ఆయన ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేవారని కూడా సమాచారం. అలాగే బాలరాజు ఎప్పుడూ ఇంటి నుండి బయటకు వచ్చేవాడు కాదని.. ఆయన ఇంటిలోకి ఎవరైనా వెళ్లాలంటే బయట నుండే మాట్లాడాలని చెప్పేవాడని కూడా స్థానికులు అంటున్నారు.