దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఆర్టీఐ కమీషనర్‌గా వ్యవహరించడమే కాకుండా..అనంతరం సాక్షి టీవీలో ఎడిటర్ స్థాయిలో పనిచేసిన దిలీప్ రెడ్డి ఇటీవల పీపుల్స్ పల్స్ పేరిట ఓ సంస్థ ప్రారంభించారు. ఆ సంస్థ తొలిసారిగా ఫస్ట్ ట్రాకర్ పోల్ సర్వే నిర్వహించింది. ఏపీలోని ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో జరిపిన సర్వే ఇది. ఈ సర్వేలో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి.
పీపుల్స్ పల్స్ సంస్థ ట్రాకర్ పోల్ పేరుతో జనవరి 16 నుంచి 21వ తేదీ మధ్యకాలంలో 35 పోలింగ్ స్టేషన్ల నుంచి 700 శాంపిల్స్ సేకరించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 20 శాంపిల్స్ చొప్పున తీశారు. ఇందులో 53 శాతం పురుషులు కాగా 47 శాతం మహిళలున్నారు. ఎస్టీలు 45 శాతం కాగా, ఓబీసీలు 30 శాతం, ఓసీలు 15 శాతం ఎస్సీలు 6 శాతం ఉన్నారు. రాష్ట్రంలోని 7 ఎస్టీ నియోజకవర్గాల్లో చేసిన సర్వే అధికార పార్టీకు కాస్త ఇబ్బందిగానే కన్పిస్తోంది. ప్రతిపక్షాలు సంఘటితమైతే అధికార పార్టీకు ఇబ్బందిగా మారవచ్చు. ప్రతిపక్షాలు ఒంటరి పోరాటం చేస్తే మరోసారి వైసీపీదే ఆధిక్యం కానుంది. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే వైసీపీ ఈసారి దాదాపు 5 శాతం ఓట్లను కోల్పోనుంది. అదే సమయంలో 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గాన్ని పోగొట్టుకోవచ్చు.
ఈ సర్వే రంపచోడవరం, పాడేరు, అరకు, సాలూరు, పాలకొండ, పోలవరం, కురుపాం నియోజకవర్గాల్లో సాగింది. ఇందులో పోలవరంలో టీడీపీకు అనుకూలంగా ఉంటే..మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే ఆధిక్యం కన్పిస్తోంది. పోలవరంలో కూడా టీడీపీ-వైసీపీ మధ్య ఓట్ల వ్యత్యాసం 1.93 శాతం మాత్రమే. ఇక జనసేన పార్టీ రంపచోడవరంలో 13.97 శాతం, అరకులో 9.23 శాతం, కురుపాంలో 9.09 శాతం, పోలవరంలో 7.27 శాతం, పాడేరులో 7.29 శాతం, సాలూరులో 5.18 శాతం, పాలకొండలో 5.30 శాతం ఓట్లు దక్కనున్నాయని తెలుస్తోంది. అంటే 2024 ఎన్నికల్లో జనసేన కీలకపాత్ర పోషించవచ్చనేది సుస్పష్టం.
మన్యంలో నాడు కాంగ్రెస్..నేడు వైఎస్సార్ సీపీ
2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో ఒక్క అరకు అసెంబ్లీ తప్ప మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. ఇక 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోలవరంలో విజయం సాధించగా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.
జనసేన-టీడీపీ పొత్తు కుదిరితే
ట్రాకర్ పోల్ సర్వేలో అధికార పార్టీకు 44.25 శాతం, టీడీపీకు 39.39 శాతం, జనసేనకు 8.19 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. అంటే వైసీపీ..టీడీపీపై 4.86 శాతం ఆధిక్యతతో ఉంది. అదే సమయంలో జనసేనకు ఈసారి 8.19 శాతం ఆధిక్యత ఉండటంతో..రెండూ కలిస్తే కచ్చితంగా అధికార పార్టీకు పరాజయం ఎదురయ్యే పరిస్థితి ఉంది.
ఇప్పుడున్న పరిణామాల ప్రకారం జనసేన-టీడీపీ పొత్తు దాదాపు ఖరారైంది. అటువంటప్పుడు ట్రాకర్ పోల్ సర్వేలో దిలీప్ రెడ్డి ఈ విషయంపై పెద్దగా విశ్లేషించకపోవడం గమనార్హం. టీడీపీ కంటే వైసీపీ కేవలం 4.86 శాతం ఓట్లు వెనుకబడి ఉంది. అదే టీడీపీకు 8.19 శాతం ఓట్లున్నట్టు చెబుతున్న జనసేన తోడైతే..7 ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీ వెనుకబడిపోయినట్టే. ట్రాకర్ పోల్ సర్వేలో అన్ని విషయాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన పీపుల్స్ పల్స్ సంస్థ ఈ రెండింటి పొత్తుపై అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం విశేషం.
Also read: Lokesh Padayatra: లోకేశ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్, షరతులతో అనుమతులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook