జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్షలో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట(మ) బండిపాలెంలో ఆదివారం పర్యటించిన మంత్రి.. తనపై ఆరోపణలు చేసిన పవన్ సాక్షాధారాలతో రావాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలు, పోరాట యాత్రల పేరుతో ప్రతిపక్ష నేతలు చంద్రబాబును విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్న లోకేశ్.. ప్రత్యేక హోదాతో పాటు 19 అంశాలను మోదీ గాలికి వదిలేశారన్నారు.
కుట్ర రాజకీయాలను అభివృద్ధితో తిప్పి కొడదామని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ అన్నారు. ప్రతి గ్రామానికి వాటర్ బడ్జెట్‌ను ఏర్పాటు చేసి రూ.22 వేల కోట్ల వ్యయంతో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించనున్నామని, గత నాలుగేళ్ళలో గ్రామీణ ప్రాంతాల్లో 17 వేల కి.మీ సిమెంట్ కాంక్రీట్ రహదారి పనులు చేపట్టామని అన్నారు. అతి త్వరలోనే 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భృతిని చెల్లించనున్నామన్నారు. వ్యవసాయ రంగంలో ప్రధాన వనరు అయిన నీటిని సంరక్షించుకోవడం రైతులతో పాటు ప్రతి పౌరుడి బాధ్యత అని లోకేశ్ అన్నారు.