ప్రజా ప్రతినిధులు ప్రజా శ్రేయస్సు కోసం పనికి వచ్చే మాటలు మాట్లాడాలని..అలా మాట్లాడడం చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కొవ్వూరు బహిరంగ సభలో నిన్న మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జవహర్ పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీరులో ఆల్కహాల్ శాతం తక్కువని.. ఆ బీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆయన చెబుతున్నారని.. ఇదేమి బోధన అని పవన్ ప్రశ్నించారు. తనను సైతం అనేక బీర్ తయారీ చేసే సంస్థలు గతంలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని అడిగాయని.. కాకపోతే తాను తిరస్కరించానని పవన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అలాగే సీఎం పద్ధతి కూడా తనకు అర్థం కావడం లేదని పవన్ అన్నారు. బెల్ట్ షాపులు రద్దు చేయాలని.. లేకపోతే తాట తీస్తానని చెప్పిన ముఖ్యమంత్రి గారే ఇప్పుడు బెల్ట్ షాపులు పెరిగిపోతున్నా అడ్డగించే పరిస్థితి కనిపించడం లేదని పవన్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదల రక్తాన్ని తాగేసి.. 20 శాతం ఆదాయం పెరిగిందని ప్రభుత్వం సంతోషపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
బెల్టు షాపులు, బీరు ప్రచారం, ఇసుక దోపిడి పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి చాగల్లు షుగర్ కర్మాగారాన్ని తెరిపించడంపై లేదని అన్నారు. ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత రైతులకు బకాయిలు కూడా చెల్లించాలన్న ఇంగితం ప్రభుత్వానికి లేకుండా పోయిందని.. ఇలాంటి విషయాలే ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయని పవన్ అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకి సైతం తూట్లు పొడుస్తూ.. జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాలు పెట్టుకొనేలా ప్రత్యేక జీవోలు తీసుకురావడానికి ప్రభుత్వం సంకల్పిస్తోందని పవన్ అన్నారు.