NTR Health University Name Change: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చడం వల్ల ఏమి సాధించాలనుకుంటున్నారో కారణం చెప్పాలని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ సర్కారు తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయంపై పాలకులు సహేతుకమైన వివరణ ఇవ్వాలని అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనో లేక రాష్ట్రంలోనో వైద్య సదుపాయాలు మెరుగైపోయాతాయేమో చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఏపీలో వైద్య సదుపాయాలు ఉండాల్సిన ప్రమాణాలకు తగిన విధంగా లేవు అనేది వాస్తవం. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ రోగుల సంఖ్యకు సరిపడినన్ని పడకలు లేవు. సిబ్బంది అందుబాటులో లేరు. కనీసం
ఔషధాలు ఉండవు. ఇవన్నీ సరిచేయకుండా కేవలం పేరు మార్చితే ఏం ప్రయోజనం అని ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కోవిడ్ వైరస్ సోకిన సమయంలో మాస్కులు అడిగినందుకే డా.సుధాకర్‌ని వేధించారు. ప్రభుత్వం వేధింపుల కారణంగానే ఆయన తీవ్ర మనోవ్యధకు లోనై మరణించిన విషయాన్ని రాష్ట్రంలో జనం ఇంకా మరచిపోలేదని గుర్తుచేశారు.
కొత్త వివాదం సృష్టించేందుకేనా ?
రాష్ట్రంలో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాల్సిన పనిని పక్కకు పెట్టి.. కేవలం విశ్వ విద్యాలయం పేరు మార్చడంలో అర్థం లేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో సమస్యల బారి నుంచి ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకనో... లేక ఇంకేవైనా కొత్త వివాదాలు సృష్టించేందుకో జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నంలా ఉందే తప్ప ఇంకేం లేదని నిప్పులు చెరిగారు. పాలకులు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చుకుంటూ పోతే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని ప్రభుత్వానికి హితవు పలికారు.
కింగ్ జార్జ్ హాస్పిటల్ పేరు మార్పుపై పవన్ కల్యాణ్ ప్రతిపాదన
ఒకవేళ పేర్లు మార్చాలి అనుకొన్నట్టయితే.. విశాఖలోని ఆనాటి కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా అని సూచించారు. బ్రిటీష్ పాలకులను గుర్తుచేస్తూ ఆ పేరు ఇంకా బ్రిటిష్ వాసనలతోనే ఉందని.. అలాంటివి విడిచిపెట్టి ఎన్టీఆర్ పేరు తొలగించడం ఏంటని మండిపడ్డారు. స్వాతంత్ర్య అమృతోత్సవాలు చేసుకున్నాం కాబట్టి విశాఖ కేజీహెచ్ పేరు మార్చి వైద్య ప్రముఖులలో ఒకరి పేరు పెడితే బాగుంటుందని ఏపీ సర్కారు ముందు పవన్ కల్యాణ్ ఓ సరికొత్త ప్రతిపాదన పెట్టారు.
ప్రజల ఆస్తులకు ఇంట్లో వాళ్ల పేర్లేందుకు..
ప్రపంచం గుర్తించిన ప్రఖ్యాత వైద్య శాస్త్రజ్ఞుల్లో ఒకరైన యల్లాప్రగడ సుబ్బారావు పేరయినా ఈ పాలకులకు తెలుసో లేదోనని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆ రోజుల్లోనే టైఫాయిడ్, బోదకాలు లాంటి రోగాలకు మందులు కనుగొన్న గొప్ప శాస్త్రవేత్త, మన తెలుగు వారు కూడా అయిన యల్లాప్రగడ సుబ్బారావు పేరుని కనీసం ఒక్క సంస్థకైనా ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజల ఆస్తులకు ఇంట్లోవాళ్ల పేర్లు పెట్టే ముందు.. ప్రజల కోసమే జీవితాలను త్యాగం చేసిన మహనీయుల గురించి పాలకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ సర్కారుకి చురకలంటించారు.
Also Read : Janasena: జనసేనలోకి హీరో ఆలీ.. రాజమండ్రి నుంచి అసెంబ్లీకి పోటీ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి