Pawan kalyan's Janasena Resolutions: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జనసేన పార్టీ చేసిన రెండు తీర్మానాలు

Pawan kalyan's Janasena Resolutions: చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తూ వస్తోన్న జనసేన పార్టీ తాజాగా పలు తీర్మానాలు చేసింది. ఈ విషయంలోనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు విషయంలోనూ తామంతా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తామని చెబుతూ ఆ పార్టీ నేతలు రెండు తీర్మానాలను చేశారు.

Written by - Pavan | Last Updated : Sep 17, 2023, 05:29 AM IST
Pawan kalyan's Janasena Resolutions: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జనసేన పార్టీ చేసిన రెండు తీర్మానాలు

Pawan kalyan's Janasena Resolutions: స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ పేరుతో స్కామ్‌కి పాల్పడ్డారనే కేసులో ఏపీ సీఐడి పోలీసులు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తూ వస్తోన్న జనసేన పార్టీ తాజాగా పలు తీర్మానాలు చేసింది. ఈ విషయంలోనే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు విషయంలోనూ తామంతా తమ నాయకుడు పవన్ కళ్యాణ్ వెంటే నడుస్తామని చెబుతూ ఆ పార్టీ నేతలు రెండు తీర్మానాలను చేశారు. ఆ తీర్మానాల వివరాలు ఇలా ఉన్నాయి.  

మొదటి తీర్మానం :
రాజమండ్రిలో 14వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్నర్యంలో ఆ పార్టీలో సమావేశమై రెండు తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను పార్టీ ఆమోదించినట్టు ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని విశాల దృక్పథంతో స్పందించారు. ఆ క్రమంలోనే కేంద్ర కారాగారానికి వెళ్ళి చంద్రబాబు నాయుడుని పరామర్శించి.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ అవసరమని పవన్ కళ్యాణ్ భావించారు. అందుకు అనుగుణంగానే రాబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి పని చేస్తాయని విస్పష్టమైన ప్రకటన చేశారు. 

రాష్ట్ర భవిష్యత్, అభివృద్ధి, యువతకు మేలు చేయాలనే సంకల్పంతో పాటు అధికార పార్టీని నిలువరించే లక్ష్యంతో జనసేన పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ నుండి ప్రకటన వెలువడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రజలను రక్షించుకునే ఉద్దేశంతోనే జనసేన పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకున్న సమున్నత నిర్ణయాన్ని జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం స్వాగతిస్తూ మనస్ఫూర్తిగా ఆమోదం తెలియచేస్తోందని... రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజాహితం కోసం అనునిత్యం ఆలోచించే పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అనుగుణంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తామని పార్టీ నేతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలసి చేసే వైసీపీ విముక్త ఆంధ్రపదేశ్ అనే  ప్రజా పోరాటంలో బీజేపీ కలసి వస్తుందని ఆశిస్తున్నాం అని చెబుతూ నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను బీజేపికే వదిలేశారు.

రాజకీయ ప్రక్రియలో క్రమశిక్షణతో కలసి పని చేస్తూ మన పార్టీ బలోపేతానికి కృషి చేద్దాం. మన లక్ష్యాన్ని సాకారం చేసే ప్రజాస్వామ్య పోరాటంలో మీ వెన్నంటి ఉండి ముందుకు వెళ్తామని, రాష్ట్ర ప్రయోజనం కోసం మీరు తీసుకొనే ప్రతి రాజకీయ నిర్ణయాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరిస్తామని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి తెలియచేసుకొంటున్నాం అని పార్టీ నేతలు తెలిపారు. 

2వ తీర్మానం :
ఇక ఇదే సమావేశంలో జన సేన పార్టీ తీసుకున్న మరో తీర్మానం ఏంటంటే.. భారత దేశ ప్రతిష్ట మరింత అంతర్జాతీయంగా ఇనుమడింప చేసే విధంగా మన గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జి20 సదస్సును అద్భుతరీతిలో విజయవంతంగా నిర్వహించారు. ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు.. అనే గొప్ప స్ఫూర్తితో నిర్వహించిన ఈ సదస్సు భారత్ ఆత్మను ప్రపంచానికి మరోసారి తెలియచేసింది. ప్రపంచమంతా వసుధైక కుటుంబం అనే మన భారతీయ సంస్కృతిని చాటుతూ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దోహదపడేలా జి20 సదస్సు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఈ సమావేశం అభినందనలు తెలియచేస్తుంది అంటూ జనసేన పార్టీ తమ తాజా ప్రకటనలో పేర్కొంది.

Trending News