ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విశాఖపట్టణం నుండి అకాడమిక్ స్టాఫ్ సభ్యులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్- 2018)ని ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. టెట్ పరీక్షా కేంద్రాల విషయంలో పొరపాట్లుదొర్లడంపై మంత్రి గంటా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఏ జిల్లా అభ్యర్థికి ఆ జిల్లాలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించకుండా.. వేరే జిల్లాలకు కేటాయించడం, దరఖాస్తులో ఆప్షన్లు పెట్టకపోయినా కొందరు అభ్యర్థులకు వేరే రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడం, మరికొందరికి రాష్ట్రంలోనే వందల కిలోమీటర్ల దూరంలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయడం ఏంటని ఆయన ఈ టెలీ కాన్ఫరెన్సులో అధికారులను ప్రశ్నించారు. తొలిసారి ఆన్‌లైన్‌లో టెట్ పరీక్ష నిర్వహిస్తున్నందున ఏ చిన్నపాటి పొరపాటుకు తావివ్వొద్దని అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను దక్కించుకున్న ప్రైవేటు సంస్థ సమర్ధతపైనా ఫిర్యాదులు రావడంతో ఈ విషయాన్ని గురువారం విజయవాడలో జరిగే సమీక్షలో చర్చిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.