ఫిబ్రవరి 24 నుంచి 26, 2018 తేది వరకు విశాఖపట్నంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టుబడులు ఆహ్వానిస్తూ భాగస్వామ్య సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో భాగంగా ఏపీ ప్రభుత్వ అధికారులు దేశ, విదేశాలకు చెందిన ఎందరో పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సందర్భంగా వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అవకాశాల గురించి తెలియజేసి పెట్టుబడులు ఆహ్వానించారు.
అందుకు తగ్గ స్థలాల కేటాయింపుల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో ఇటీవలే తొలివిడతగా పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి.
సిన్హపురి టైల్స్, స్పందన లాజిస్టిక్స్, తప్మా ప్లాస్టిక్, కిసాన్ క్రాఫ్ట్, ఫర్నిచర్ వరల్డ్ గ్రూప్, జసాకా ఫాస్టనర్స్, ఆర్సీస్ ప్రాజెక్ట్స్, శిగాచీ ఇండ్స్, ప్రాసా లెదర్స్, రెయిన్ సీఐఐ కార్బన్, ఎస్వీఆర్ స్పిన్నింగ్ మిల్, డికోవిటా సిరామిక్స్, శ్రీ చక్ర ఎకోటెక్స్, డోజ్‌కో, మని ఎలియన్స్, టీజీఐ ప్యాకేజింగ్, కెర్రి ఇన్డివ్ లాజిస్టిక్స్, సీఎక్స్ ప్రెసిసన్ మెక్ మొదలైన కంపెనీలు కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టడంతో పాటు తమ కంపెనీల ద్వారా ఉపాధి ఇవ్వడానికి కూడా ముందుకొచ్చాయి.
రూ.7 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే చిన్న కంపెనీల నుండి రూ.900 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టే పెద్ద కంపెనీలు కూడా ఈ సంస్థలలో ఉండడం గమనార్హం. విశాఖపట్నంతో పాటు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఈ కంపెనీలు ముందుకు రావడం గమనార్హం.