ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రి కింజరపు అచ్చెన్నాయుడికి ప్రాణహాని ఉందంటూ, శ్రీకాకుళంలోని పలువురు అధికారులకు ఫోన్ కాల్స్ రావడం పలు చర్చలకు దారితీసింది. ఇప్పటికే ఈ విషయంపై స్పందించిన టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుండీ పదే పదే ఇలాంటి ఫోన్ కాల్స్ రావడం వల్ల టెక్కలి సీఐ భవానీప్రసాదరావు సుమోటోగా కేసు నమోదు చేశారు.
మంత్రిని హతమార్చేందుకు కోటబొమ్మాళి ప్రాంతంలో జిలెటిన్ స్టిక్స్ కూడా అమర్చామని ఆగంతకులు ఫోన్ చేసి బెదిరించడంతో.. కాల్ ట్రాక్ చేసిన పోలీసులు అది ఒడిశా రాష్ట్ర నెంబరు నుండి వచ్చినట్లు తెలిపారు. అయితే ఇది ఆకతాయిలు సరదాగా చేసిన పనా.. లేదా మావోయిస్టుల నుండి మంత్రికి ముప్పు ఉందా? అన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.