ఆంధ్రప్రదేశ్‌కి కొత్త గవర్నర్‌గా కిరణ్ బేడీ?

రెండు తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే కొత్త గవర్నర్లు రానున్నట్లు తెలుస్తోంది.

Last Updated : Mar 25, 2018, 04:29 PM IST
ఆంధ్రప్రదేశ్‌కి కొత్త గవర్నర్‌గా కిరణ్ బేడీ?

రెండు తెలుగు రాష్ట్రాలకు త్వరలోనే కొత్త గవర్నర్లు రానున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని పంపాలనే ఆలోచనలో కేంద్రం ఉందట. అలాగే తెలంగాణ గవర్నర్‌గా మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఇరిగేషన్) సీవీఎస్‌కే శర్మ పేరు కూడా కేంద్రం ప్రతిపాదనలో ఉందని సమాచారం. పార్లమెంటు సమావేశాలు పూర్తికాగానే ఈ మేరకు నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.
 
హైదరాబాదు నుంచి గవర్నర్  ఈఎస్ఎల్ నరసింహన్ పనిచేస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ.. ఏపీకి  కొత్త గవర్నర్‌ను నియమించాలని ఇప్పటికే కేంద్రాన్ని ఏపీ బీజేపీ నేతలు కోరడం తెలిసిందే..! ఏడాది మొదట్లో ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించాలని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ కూడా  రాశారు. ఏపీకి ఆయన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తి రాష్ట్ర ప్రజల్లో ఉందని, ప్రత్యేకంగా గవర్నర్ ఉంటే పాలన బాగుంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
 
ఇటీవలి కాలంలో ఏపీలో రాజకీయాలు అనూహ్యంగా మారాయి. ఎన్డీఏ కూటమి నుంచి అధికార తెదేపా బయటికి వచ్చింది. కేంద్ర కేబినెట్ నుంచి కూడా తప్పుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే గవర్నర్ల మార్పు అనివార్యం కావచ్చంటున్నారు కొందరు విశ్లేషకులు. ఇందులో భాగంగా ఏపీకి కిరణ్ బేడీని గవర్నర్‌గా పంపేందుకు బీజేపీ అధిష్టానం కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మరో ముగ్గురు పేర్లను కూడా కేంద్రానికి ఆర్ఎస్ఎస్ సిఫారసు చేసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

Trending News